Shaheen Malik : యాసిడ్ దాడి ఆమె ప్రయాణాన్ని ఆపలేదు.. మరెంతో మంది బాధితులకు దారి చూపిస్తున్న షాహీన్ మాలిక్
యాసిడ్ దాడిలో 90 శాతం గాయాలైనా ఆత్మవిశ్వాసంతో ఆమె కోలుకుంది. తనలాగ దాడికి గురైన వందలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. షాహీన్ మాలిక్ స్ఫూర్తివంతమైన కథనం చదవండి.

Shaheen Malik
Shaheen Malik : షాహీన్ మాలిక్.. యాసిడ్ దాడి ఆమె జీవిత ప్రయాణాన్ని ఆపలేదు. తనలాగా యాసిడ్ దాడికి గురైన 300 మంది మహిళల జీవితాలకు మార్గం చూపించారు. మరెంతోమందికి సాయం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ‘అప్నా ఘర్’ పేరుతో ఓ సంస్థను నడుపుతూ ముందుకు సాగుతున్న షాహీన్ మాలిక్ జీవితం చాలామందికి స్ఫూర్తినిస్తుంది.
Sudha Murthy :ప్రభాస్ సినిమా పాటంటే సుధామూర్తికి చాలా ఇష్టమంట.. ఏ పాటో తెలుసా?
షాహీన్ మాలిక 2009 లో MBA చదువుకుంటున్నారు. ఆమె వయసు అప్పుడు 29 సంవత్సరాలు. ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీలో స్టూడెంట్ కౌన్సెలర్‌గా పని చేస్తున్నారు. ఆ సమయంలో అనుకోని ఘోరం జరిగిపోయింది. షాహీన్ మాలిక్‌పై యాసిడ్ అటాక్ జరిగింది. ఆఫీస్ నుంచి బయటకు వచ్చి రోడ్డు దాటే ప్రయత్నంలో ఓ ముసుగు కప్పుకుని ఉన్న వ్యక్తికి పక్కన నిలబడ్డారట. అకస్మాత్తుగా ఆమె ముఖంపై యాసిడ్ పోయడంతో గట్టిగా అరిచే ప్రయత్నం చేసారట. ఈలోపులోనే అన్యాయం జరిగిపోయింది. ఆమెపై యాసిడ్ దాడికి పాల్పడిన వ్యక్తులు ఆమె చదువుకుంటున్న యూనివర్సిటీలో విద్యార్ధులేనట. ఆమె విజయాలను చూసి అసూయతో వారు ఈ పని చేసారని షాహీన్ చెప్పారు. 2015 లో దాడికి పాల్పడ్డ వ్యక్తిని బాల నేరస్థుడిగా తేల్చారట. ఇంకో ముగ్గురిపై న్యాయపరమైన విచారణ ఇంకా కోర్టులో కొనసాగుతూనే ఉందట.
షాహీన్ మాలిక్‌పై యాసిడ్ దాడి జరిగినపుడు ఆమె ముఖం.. శరీరం 90 శాతం కాలిపోయాయి. శారీరకంగా, మానసికంగా ఆమె తీవ్ర పోరాటం చేసారు. ఆమె పూర్తిగా రికవరీ అవడానికి 13 సంవత్సరాలు పట్టింది. ఆమె ఎడమ కన్ను తిరిగి చూపు పొందడానికి అనేక శస్త్ర చికిత్సలు జరిగాయట. తనపై జరిగిన యాసిడ్ అటాక్ తర్వాత షాహీన్ తనలాగ యాసిడ్ దాడికి గురైన మహిళల జీవితాలను మార్చడానికి అన్వేషణ ప్రారంభించారు. 2013 లో తన సొంత NGO ని ప్రారంభించి ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ (DCW), హ్యూమన్ రైట్స్ లా నెట్ వర్క్ (HRLN) , మీర్ ఫౌండేషన్ సంస్థలతో కలిసి పనిచేయడం ప్రారంభించారు.
Ankur Warikoo : సోషల్ మీడియాలో తన ‘ఫెయిల్యూర్ రెజ్యూమ్’ పంచుకున్న యూట్యూబర్, రచయిత అంకుర్ వారికూ
2021 లో షాహీన్ తన సొంత NGO బ్రేవ్ సోల్స్ ఫౌండేషన్ ప్రారంభించారు. దాని షెల్టర్ హోమ్ అప్నా ఘర్ ద్వారా ఆమె ఇప్పటి వరకూ యాసిడ్ దాడి నుంచి బయటపడిన 300 మందికి శస్త్ర చికిత్సలు, పరిహారం వంటి సాయం అందేలా సహాయం చేయడం ద్వారా వారి జీవితాల్లో వెలుగు తీసుకువచ్చారు. యాసిడ్ దాడి తర్వాత దాని నుంచి కోలుకోవడమే కాకుండా మరెంతోమంది మహిళలకు సాయం అందిస్తున్న షాహీన్ మాలిక్ నిజంగా అభినందనీయురాలు.