Meghalaya honeymoon Case
Meghalaya Honeymoon Case: మేఘాలయ హనీమూన్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీకి, సోనమ్‌కు మే 11న వివాహం అయింది. ఆ తరువాత వారు హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. అయితే, సోనమ్, ఆమె ప్రియుడుగా చెబుతున్న రాజ్ సింగ్ కుష్వాహా కాంట్రాక్ట్ కిల్లర్లతో రాజా రఘువంశీని హత్య చేయించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ హత్య కేసులో సోనమ్‌తోపాటు ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో 19 ఏళ్ల ఆకాశ్ రాజ్‌పుత్, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 22 ఏళ్ల విశాల్ సింగ్ చౌహాన్, 21 ఏళ్ల రాజ్‌సింగ్ కుష్వాహా, బినా పట్టణంలో 23 ఏళ్ల ఆనంద్ కుర్మీలను పోలీసులు అరెస్ట్‌చేశారు. అయితే, పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Also Read: అమ్మ సోనమ్.. ఎంత క్రిమినల్ మైండ్ సెట్..! రాజా రఘువంశీని చంపేశాక ఆధారాలు ఎలా చెరిపేసిందో చూడండి…
రాజా రఘువంశీ అంటే ఇష్టం లేకపోతే అసలు అతడ్ని సోనమ్ పెళ్లి ఎందుకు చేసుకుందని ప్రతిఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. సోనమ్ రాజా రఘువంశీని పెళ్లిచేసుకోవటానికి బలమైన కారణం ఉందట. పెళ్లికి తాను నిరాకరిస్తే అనారోగ్యంతో ఉన్న తన తండ్రి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని భయపడిన సోనమ్.. ఇష్టంలేకపోయినా పెళ్లికి అంగీకరించినట్లు లలిత్‌పూర్‌కు చెందిన ఆకాష్ రాజ్‌పుత్ పోలీసుల విచారణలో వెల్లడించాడు.
సోనమ్ తండ్రి దేవి సింగ్ కొంతకాలంగా గుండె సమస్యతో బాధపడుతున్నాడు. రాజా రఘువంశీని వివాహం చేసుకోవాలని తన తండ్రి సోనమ్‌కు సూచించాడు. తండ్రి కోరిక మేరకు వివాహం చేసుకోకపోతే ఆయన బాధతో గుండెపోటుతో చనిపోతాడని సోనమ్ భయపడినట్లు రాజ్‌పుత్ చెప్పాడు. తన తండ్రిని ఇబ్బంది పెట్టొద్దని, తన తండ్రి ఆరోగ్యం మరింత ప్రమాదంలో పడకుండా ఉండేందుకు ఇష్టంలేకపోయినా సోనమ్ రఘువంశీని పెళ్లి చేసుకుందని ఆకాష్ రాజ్‌పుత్ తెలిపాడు.
సోనమ్ రాజా రఘువంశీని వివాహం చేసుకున్న వెంటనే ఆమె ప్రేమికుడు రాజ్ కుష్వాహా తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు, వివాహం జరిగిన ఐదు రోజులకే రాజా రఘువంశీ అడ్డును తొలగించుకోవాలని రాజ్ కుష్వాహా ప్లాన్ వేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇండోర్‌లోని నంద్‌బాగ్ కాలనీకి సమీపంలో ఉన్న సోనమ్ నివాసం పక్కన ఉన్న ఓ కేఫ్ లో హత్యకు పథకం రచించినట్లు విచారణలో రాజ్‌పుత్ వెల్లడించాడని పోలీసులు తెలిపారు. అయితే, సోనమ్ కు ఈ పథకం గురించి ఎప్పుడు తెలిసింది.. అప్పుడు ఆమె ఏమని చెప్పింది అనే విషయాలను తెలుసుకునేందుకు హత్యకేసులో ప్రధాన వ్యక్తిగా భావిస్తున్న రాజ్ కుష్వాహాను పోలీసులు విచారిస్తున్నారు.