హనీమూన్‌కి వెళ్లి హత్యకు గురైన ఇండోర్ వ్యాపారి రాజా రఘువంశీ కేసులో మేఘాలయ సిట్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే రాజా రఘువంశీ భార్య సోనమ్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరిన్ని విషయాలు బయటకు వచ్చాయి.
పెళ్లికి ముందు రాజ్ కుశ్వాహా అనే యువకుడిని ప్రేమించింది సోనమ్. తనకు రాజా రఘువంశీతో పెళ్లి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కుటుంబాన్ని ముందే హెచ్చరించింది. ఆమె హెచ్చరించినట్లుగానే పెళ్లైన కొన్ని రోజులకే రాజా రఘువంశీ హత్యకు గురికావడం గమనార్హం.
రాజా రఘువంశీ సోదరుడు విపిన్ పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం.. సోనమ్ పెళ్లికి ముందు రాజ్ కుశ్వాహా అనే యువకుడితో తాను లవ్‌లో ఉన్నట్లు తన తల్లికి చెప్పింది. కానీ తల్లి వారి ప్రేమను ఒప్పుకోలేదు. సోనమ్‌కు వేరొకరితో వెంటనే పెళ్లి చేయాలని తల్లి భావించింది.
సోనమ్ తన లవ్ మ్యాటర్‌ను బయటపెట్టిన తర్వాత రాజా రఘువంశీని పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు ఆమెపై ఒత్తిడి చేశారు. దీంతో సోనమ్ ఒప్పుకుని రాజాను పెళ్లి చేసుకుంది కానీ ‘నా పని నేను చూసుకుంటాను.. ఇది ఎంతవరకు పోతుందో మీరే చూస్తారు’ అంటూ హెచ్చరించింది. అయితే, ఆమె ఏదో కోపంలో అలా అందని అనుకున్నారు గానీ, భర్తను ఇలా హత్య చేయిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఆమె ఇంత ఘోరంగా ప్రతీకారం తీర్చుకుంటుందని తెలుసుకున్న కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు.
రాజాతో పెళ్లికి అయిష్టంగానే సోనమ్ ఒప్పుకున్నట్లు స్పష్టమవుతోంది. “పెళ్లి జరిగాక నేను అతడిని ఏం చేస్తానో మీరే చూస్తారు. అందరూ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది” అని ఆమె తీవ్రంగా హెచ్చరించినప్పటికీ ఆమెకు రాజా రఘువంశీతో కుటుంబ సభ్యులు పెళ్లి చేశారు. అనంతరం రాజా, సోనమ్ ఇద్దరూ మేఘాలయ హనీమూన్ టూర్‌కు వెళ్లిన సమయంలో తన ప్లాన్‌ను సోనమ్ అమలు చేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హత్య జరిగిన తర్వాత తన ప్రియుడు రాజ్‌తో సోనమ్ హోటల్ గదిలో కొన్ని గంటలు గడిపినట్టు తెలిసింది. అనంతరం ఆమెను ఇండోర్‌కు పంపించాడు. అక్కడ రెండు రోజులు ఉన్నట్టు సమాచారం.
మే 11న ఇండోర్‌లో వివాహం.. జూన్ 2న మేఘాలయలో మృతదేహం
సోనమ్, రాజా మే 11న ఇండోర్‌లో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత రాజా, సోనమ్ హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. మే 23న నాంగ్రియట్ గ్రామంలోని హోమ్‌స్టే నుంచి చెకౌట్ అయిన తర్వాత ఇద్దరూ అదృశ్యమయ్యారు. జూన్ 2న గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో రాజా మృతదేహం కనపడింది. హత్య అనంతరం సోనమ్ కనిపించకుండా పోయింది. ఆమె తన ప్రేమికుడితో కలిసి రాజా హత్యకు ప్లాన్ వేసినట్టు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. ఇద్దరూ హత్య కోసం కిలర్లను కిరాయికి తీసుకున్నట్టు నిర్ధారించుకున్నారు. సోనమ్ ఈ హత్య కోసం రూ.20 లక్షల డీల్ కుదుర్చుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.