మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తండ్రి మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారి బుక్కాపురం నాదెళ్ల యుగంధర్ కన్నుమూశారు. పీవీ నర్సింహరావు ప్రధానిగా ఉన్న సమయంలో ప్రధాని కార్యాలయం కార్యదర్శిగా బీఎన్ యుగంధర్ కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
దేశంలో గ్రామీణాభివృద్ధిశాఖలో అనేక కీలక సంస్కరణలు తీసుకుని రావడంలో యుగంధర్ కీలకంగా వ్యవహరించారు. నిజాయితీపరుడిగా, సమర్థ ఐఏఎస్ అధికారిగా పేరు తెచ్చుకున్న యుగంధర్ ప్రణాళిక సంఘం సభ్యుడిగా సేవలు అందించారు. లాల్‌బహదూర్‌శాస్త్రి ఐఏఎస్ అకాడమీ డైరక్టర్‌గా పనిచేసిన యుగంధర్ కు పేదల పక్షపాతి ఐఏఎస్‌గా గుర్తింపు ఉంది.
అనంతపురం జిల్లా, ఎల్లనూరు మండలం, బుక్కాపురం గ్రామము ఆయన సొంత ఊరు. బుక్కాపురం నాదెళ్ల యుగంధర్ 1962 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. రాష్ట్రంలో మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. 2004 నుంచి 2009 వరకు ప్రధాని నేతృత్వంలోని కేంద్ర ప్రణాళిక సంఘం సభ్యునిగా, ప్రధాని పీవీ నరసింహరావు కార్యదర్శిగా పనిచేశారు.
నాదెళ్ల యుగంధర్ ఐఏఎస్‌కు ఎంపికైన తర్వాత కుటుంబాన్ని హైదరాబాద్‌కు మార్చారు. 1967లో యుగంధర్ దంపతులకు హైదరాబాద్‌లో సత్య నాదెళ్ల జన్మించారు.