Corona vaccine : కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్ కోసం ప్రపంచ ప్రజలంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్న తరుణంలో ‘యూనివర్శిటీ ఆఫ్ వాషింఘ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్’కు చెందిన పరిశోధకులు శుభవార్త అందించారు. అతి సూక్ష్మ కణాలతో తాము రూపొందించిన కరోనా వ్యాక్సిన్‌ను ముందుగా ఎలుకలపై ప్రయోగించి చూడగా అద్భుత ఫలితాలొచ్చాయని తెలిపారు.
కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వారిలో కంటే తాము వ్యాక్సిన్‌ను ప్రయోగించిన ఎలుకల్లో దాదాపు పది రెట్లు రోగ నిరోధక శక్తి పెరగడం విశేషమని చెప్పారు. వైరస్‌ను గుర్తించే జ్ఞాపక శక్తి సెల్స్ అభివృద్ధి చెందడం కూడా తమ వ్యాక్సిన్ ప్రయోగాల్లో మరో విశేషమని పేర్కొన్నారు.
కొన్ని ఇతర ఔషధ కంపెనీలు తయారు చేస్తోన్న వ్యాక్సిన్ల తరహాలో తాము కనుగొన్న వ్యాక్సిన్‌ను ఫ్రీజర్లో భద్రపర్చాల్సిన అవసరం లేదని, అందుకని దీన్ని ప్రపంచంలో ఎక్కడ తయారు చేసినా ఎల్లవేళలా ఏ ప్రాంతానికైనా తరలించవచ్చని పరిశోధకులు తెలిపారు.
వాస్తవంగా ఇవ్వాల్సిన వ్యాక్సిన్ డోసులో ఐదోవంతు డోస్‌నే ఎలుకల్లో ప్రయోగించి విజయం సాధించామని మెడికల్ యూనివర్శిటీలోని బయోకెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నీల్ కింగ్ చెప్పారు. తమ ప్రయోగంలో శరీరంలోని రోగ నిరోధక శక్తికి సంబంధించిన బీ సెల్స్‌లో కూడా అభివృద్ధి కనిపించడం ఇంకో విశేషమని ఆయన ‘సెల్’ జర్నల్‌కు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.
ఈ ఏడాది చివరి నాటికల్లా మానవులపై ప్రయోగాలను పూర్తి చేసుకొని వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభమవుతోందని, వ్యాక్సిన్ ఉత్పత్తికి అప్పుడే రెండు బయోటెక్ కంపెనీలను గుర్తించామని పరిశోధకులు తెలిపారు. అయితే ఆ బయోటెక్ కంపెనీల పేర్లను మాత్రం వెల్లడించలేదు.