Modi Govt Diwali Gift: ఈసారి దీపావళికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు, సామాన్య ప్రజలకు ఒక పెద్ద కానుక ఇవ్వనుందని తెలుస్తోంది. ఒకవైపు, పెరిగిన డియర్నెస్ అలవెన్స్ (DA), డియర్నెస్ రిలీఫ్ పొందడానికి సన్నాహాలు జరుగుతుండగా..
మరోవైపు, దీపావళికి ముందు జీఎస్టీ సంస్కరణలను అమలు చేయడం గురించి ప్రధాని మోదీ మాట్లాడారు. సాధారణ ప్రజలు, వ్యాపారులకు, ప్రభుత్వ ఉద్యోగులకు దీని ప్రయోజనం నేరుగా కలగనుంది.
కొత్త డీఏ ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది?
మార్చి 2025లో, కేంద్ర మంత్రివర్గం 48 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 66 లక్షలకు పైగా పెన్షనర్లకు 2శాతం డీఏ / డీఆర్ పెంపును ఆమోదించింది. ఇది జనవరి 2025 నుండి అమల్లోకి వచ్చింది. ఇప్పుడు ఉద్యోగులు, పెన్షనర్లు 55శాతం చొప్పున డీఏ డీఆర్ పొందుతున్నారు.
7వ వేతన సంఘం ప్రకారం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస మూల వేతనం రూ. 18,000. పెన్షనర్ల కనీస పెన్షన్ రూ. 9,000. 55శాతం డీఏతో, ఒక్కో ఉద్యోగి మొత్తం రూ. 27,900, ఒక పెన్షనర్ రూ. 13,950 పొందుతున్నారు.
ప్రతి సంవత్సరం ప్రభుత్వం రెండుసార్లు డీఏను పెంచుతుంది. ఒకసారి జనవరిలో, రొకటి జూలైలో. ఇప్పుడు జూలై 2025 కోసం తదుపరి పెంపు సెప్టెంబర్‌లో ప్రకటించబడుతుందని భావిస్తున్నారు. నివేదికల ప్రకారం, ఈసారి డీఏ 3శాతం పెరగవచ్చు.
ఇది జరిగితే, డీఏ 58శాతం అవుతుంది. దీపావళి నాటికి దీనిని అమలు చేయవచ్చు.
ప్రతిపాదిత జీఎస్టీ సంస్కరణలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వంతో సహకరించాలని ప్రధాని మోదీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. దీపావళికి ముందు ఈ సంస్కరణలు అమలు చేయబడతాయని.. పేదలు, మధ్యతరగతి, చిన్న, పెద్ద వ్యాపారులు దీని ప్రయోజనం పొందుతారని కూడా ఆయన అన్నారు.
“సంస్కరణలను సుపరిపాలనకు చిహ్నంగా మేము భావిస్తున్నాము. జీవితాన్ని, వ్యాపారాన్ని సులభతరం చేయడమే మా లక్ష్యం.
అందుకే మేము తదుపరి తరం సంస్కరణలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తున్నాము. ఈ సంస్కరణలు ఈ దీపావళికి డబుల్ బోనస్‌గా నిలుస్తాయి” అని ప్రధాని మోదీ అన్నారు.
8వ వేతన సంఘం కూడా రాబోతోంది..
జనవరి 2025లో, కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ఆమోదించింది. కానీ అధికారిక నోటిఫికేషన్ ఇంకా రాలేదు.
ఈ నోటిఫికేషన్ సకాలంలో జారీ చేయబడుతుందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటులో తెలిపారు. దీని అర్థం భవిష్యత్తులో, ఉద్యోగుల జీతం, పెన్షన్‌లో మరిన్ని ఇంప్రూవ్ మెంట్స్ చూడొచ్చు.(Modi Govt Diwali Gift)