పార్లమెంటులో ప్రధాని మోడీ నోట.. ఫేక్ వెబ్‌సైట్ మాట!

  • Publish Date - February 7, 2020 / 07:58 AM IST

పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ.. ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ సహా లెఫ్ట్ పార్టీలపై విరుచుకుపడ్డారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టంపై ఆయన ప్రసంగిస్తూ విపక్ష పార్టీ సభ్యులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లోకసభలో దాదాపు గంటపాటు సుదీర్ఘంగా ప్రసంగించిన మోడీ.. కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి ప్రస్తావించారు. ఆర్టికల్ 370ను రద్దు చేయడాన్ని వ్యతిరేకించిన జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలను ఈ సందర్భంగా మోడీ ప్రస్తావించారు.

ఒమర్ అబ్దుల్లా గత ఆరు నెలలుగా గృహ నిర్బంధంలో ఉన్నారు. పార్లమెంటులో మోడీ ప్రసంగం తర్వాత జమ్మూకశ్మీర్ మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ములపై పోలీసులు పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ (PSA) ప్రయోగించడం గమనార్హం. ఈ ఇద్దరు మాజీ సీఎంల నిర్బంధ గడువును పెంచినట్టు గురువారమే అధికారులు వెల్లడించారు.

వాస్తవానికి.. సెటైరికల్ వెబ్ సైట్.. ‘ Faking News ఫేకింగ్ న్యూస్’ వెబ్ సైట్లో వచ్చిన కథనాన్ని ప్రధానమంత్రి మోడీ ఉటంకించారు అంతే.. ‘ఆర్టికల్ 370ని రద్దు చేస్తే అల్లకొల్లోలం (భూకంపం వచ్చి ) ఏర్పడి భారత్ నుంచి కశ్మీర్ ను వేరు చేస్తుంది’ అనే ఈ వ్యాఖ్యను వ్యంగ్య వెబ్‌సైట్ (మే 28, 2014న) ప్రచురించింది.

ఈ కథానాన్ని ప్రచురించడానికి ముందు రోజు, అబ్దుల్లా ఆర్టికల్ 370, మోడీ ప్రభుత్వం గురించి ట్వీట్ చేశారు. ఆర్టికల్ 370 రద్దు చేస్తూ.. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో భాగం కాదని ఆ ట్వీట్‌లో ఉంది. మోడీ ప్రస్తావనతో పోల్చితే అబ్దుల్లా.. భూకంపం అనే మాటను ప్రస్తావించలేదు.

ఆ పదం ఫేకింగ్ న్యూస్ కథనంలో మాత్రమే కనిపిస్తోంది. గూగుల్ సెర్చ్ సూచించిన నివేదికల్లో అబ్దుల్లా వ్యాఖ్యల్లో ఏది మోడీ ఉదహరించలేదు.ప్రధాని నరేంద్ర మోడీ ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలను ప్రస్తావించే వీడియోను కూడా పీఎంఓ ఇండియా యూట్యూబ్ ఛానళ్లలో చూడొచ్చు.

అబ్దుల్లా ట్విట్టర్ అకౌంట్ నుంచి వచ్చిన చివరి ట్వీట్ ఆగస్టు 5, 2019న షేర్ అయినట్టుగా ఉంది. ఈ వీడియోను కూడా భారతీయ జనతా పార్టీ తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేసింది. పార్లమెంటులో మోడీ చేసిన వ్యాఖ్యలతో పాటు ఒమర్ అబ్దుల్లా ప్రకటించినట్టుగా ఉన్న వ్యాఖ్యలను కూడా బీజేపీ ట్వీట్ చేయడం గమనార్హం.

ఆరేళ్ల క్రితం సెటైరికల్ వెబ్ సైట్లో కథనాన్ని పార్లమెంటులో మోడీ ఎందుకు ప్రస్తావించారు అనేదానిపై స్పష్టత లేదు. మరోవైపు ఒమర్ అబ్దుల్లా ఇలాంటి ప్రకటన చేసి ఉండకపోవచ్చు అని నేషనల్ కాన్ఫిరెన్స్ ప్రతినిధి ఇమ్రాన్ నభి అభిప్రాయపడ్డారు. ఈ ప్రకటన సెటైరికల్ వెబ్ సైట్ నుంచి వచ్చినదే కావొచ్చు అన్నారు.