మహారాష్ట్రలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్సీపీ-కాంగ్రెస్ మద్దతుతో శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు ఆయా పార్టీల నాయకుల నుంచి సంకేతాలు వస్తున్నాయి. శివసేన ముఖ్య నాయకుడు సంజయ్ రౌత్ గురువారం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో సమావేశమైన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై పవార్ తో చర్చించినట్లు సంజయ్ రౌత్ తెలిపారు.
శివసేన నాయకులు నిన్న శరద్ పవార్ తో భేటీ తర్వాత ఇవాళ(నవంబర్-1,2019)మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(MPCC)నాయకులు బాలాసాహెబ్ తోరట్,అశోక్ చవాన్,పృధ్విరాజ్ చవాన్,విజయ్ వాడెట్టివర్,మానిక్ రావ్ ఠాక్రే లు ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమవుతుండటం ఇప్పుడు మహా రాజకీయాలు మలుపు తీసుకుంటున్నాయా అని అందరిలో అనుమానం కలుగుతోంది. మరోవైపు ఢిల్లీ ముందు మహారాష్ట్ర తలవంచందు అంటూ శరద్ పవార్ నివాసానికి దగ్గర్లో,ముంబైలో పలుచోట్ల బ్యానర్లు కన్పిస్తున్నాయి. బీజేపీ-శివసేన మధ్య 50:50 ఫార్ములా విషయంలో మాటల యుద్ధం కొనసాగుతున్న సమయంలో వారంలో రెండోసారి గురువారం శివసేన నాయకులు గవర్నర్ తో సమావేశమయ్యారు. శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్యఠాక్రే,పలువురు శివసేన నాయకులు గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీతో సమావేశమయ్యారు.
చెరో రెండున్నసంవత్సరాల పాటు సీఎం సీటుని పంచుకోవాలని శివసేన చేస్తున్న ప్రతిపాదనను బీజేపీ ఒప్పుకోవడం లేదు. 5ఏళ్లు తానే సీఎం అని దేవేంద్ర ఫడ్నవీస్ బహిరంగ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. శివసేనకు 16మంత్రి పదవులు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ చెబుతోంది. బీజేపీ తమ డిమాండ్ లకు ఒప్పుకోకుంటే ఎన్సీపీ తమకు మద్దతిచ్చేందుకు రెడీగా ఉందంటూ శివసేన బీజేపీని పరోక్షంగా హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటిమికి ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత మెజార్టీ వచ్చినప్పటికీ పదవుల విషయంలో క్లారిటీ లేక ఇప్పటివరకు కొత్త ప్రభుత్వం కొలువుదీరలేదు.