ఢిల్లీలోని ఎర్రకోటను తనకు అప్పగించాలని సుల్తానా బేగం అనే మహిళ సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్ వేసింది. తాను మొగల్ సామ్రాజ్య చివరి చక్రవర్తి బహదూర్ షా జఫర్ II వారసురాలినని చెప్పింది. ఒకవేళ ఎర్రకోటను తనకు అప్పగించడం కుదరకపోతే అందుకు బదులుగా సర్కారు నుంచి ఆర్థిక సాయం ఇప్పించాలని విన్నవించుకుంది.
ఆమె వేసిన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం నిన్న విచారణ జరిపి, చివరకు దాన్ని కొట్టివేసింది. ఆమె వేసిన పిటిషన్ తప్పుదోవ పట్టించేదిగా ఉందని చెప్పింది. అంతేకాదు, ఎర్రకోట మాత్రమే ఎందుకు ఇవ్వాలని, తాజ్ మహల్, ఫతేపూర్ సిక్రీ వంటివి ఎందుకు వద్దని వ్యంగ్యంగా ప్రశ్నించింది.
సుల్తానా బేగం పిటిషన్లు వేయడం ఇది తొలిసారేం కాదు. ఆమెకు పిటిషన్లు వేసే అలవాటు 2021 నుంచి ఉంది. అప్పట్లో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసి, తాను రెండవ బహదూర్ షా జఫర్ ముని మనవడి భార్యనని తెలిపింది. 1857లో బహదూర్ షా జఫర్‌ను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బహిష్కరించి, అనంతరం ఎర్రకోట, ఆస్తులను జప్తు చేసిందని చెప్పింది.
ఇప్పుడు భారత సర్కారు అధీనంలో ఉన్న ఆ ఆస్తులను తమకు ఇవ్వాలని కోరింది. దీంతో ఈ పిటిషన్ వేయడంలో 164 ఏళ్ల జాప్యానికి కారణమేంటంటూ జడ్జి పిటిషన్‌ను కొట్టివేశారు. 2024లోనూ ఆమె డివిజన్ బెంచ్‌కు వెళ్లారు. అక్కడ కూడా ఆమె అభ్యర్థన తిరస్కరణకు గురైంది. హైకోర్టులో పిటిషన్లను తిరస్కరిచండంతోనే సుల్తానా బేగం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఇప్పుడు అక్కడ కూడా ఆమెకు నిరాశే ఎదురైంది.