Online Scams
Cyber Criminals: దేశంలో రోజురోజుకు ఆన్‌లైన్ మోసాలు (Online scams) పెరిగిపోతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం (Technical knowledge) వేగంగా విస్తరిస్తున్న క్రమంలో సైబర్ నేరగాళ్లు (Cyber criminals) రెచ్చిపోతున్నారు. కుర్చున్న సీట్లోనుంచి కదలకుండా కోట్ల రూపాయలు కొట్టేస్తున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో రోజూ వెలుగులోకి వస్తున్నాయి. తాజా ముంబైలో ఓ మహిళ ఆన్‌లైన్‌లో మోసానికి గురైంది. వైద్యుడి అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించి సైబర్ మోసగాళ్లకు చిక్కింది. తద్వారా తన అకౌంట్ నుంచి రూ. 1.5లక్షలు పోగొట్టుకుంది. డబ్బులు పోయాయని సదరు మహిళ ముంబై పోలీసులను ఆశ్రయించింది. వారు విచారణ జరిపి అసలు విషయాన్ని చెప్పారు. ఆస్పత్రిలో డాక్టర్ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నం చేసిన సమయంలో సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేశారని పోలీసులు గుర్తించారు.
బాధిత మహిళ బీకేసీ (బాంద్రా కుర్లా కాంప్లెక్స్)లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది. ఆమె చెంబూర్ ఆసుపత్రిలో ఓ డాక్టర్ అపాయింట్‌మెంట్‌కోసం ఆన్‌లైన్‌లో నెంబర్ సెర్చ్ చేసింది. ఆన్‌లైన్‌లో లభ్యమైన నెంబర్‌కు ఫోన్ చేసింది. అయితే, ఆ నెంబర్ సైబర్ నేరగాళ్లదని ఆ మహిళ గుర్తించలేక పోయింది. మహిళ ఫోన్ చేయగానే సైబర్ నేరగాళ్లు మాటల్లో పెట్టి ఆమె అకౌంట్ లో నుంచి రూ. 1.5లక్షలు కొట్టేశారు. ఫోన్ కాల్ తరువాత ఆమె అకౌంట్ నుంచి డబ్బులు డ్రా అయినట్లు మెస్సేజ్ వచ్చింది. ఆ మెస్సేజ్ చూసి బాధితురాలు ఒక్కసారిగా కంగుతింది. కార్యాలయ సిబ్బందికి ఈ విషయాన్ని తెలియజేయడంతో పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. వెంటనే సదరు మహిళ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు అసలు విషయాన్ని గుర్తించారు. మహిళ ఫోన్ చేసింది ఆస్పత్రి నెంబర్‍కు కాదని గుర్తించారు. అది సైబర్ నేరగాళ్ల నెంబర్ అని, వాళ్లే ఆమెను మాటల్లో పెట్టి డబ్బులు దోచేశారని గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు సైబర్ నేరగాళ్ల గుట్టు తెలుసుకొనే పనిలో నిమగ్నమయ్యారు. అయితే, ఏదైనా ఆస్పత్రిలో డాక్టర్ అపాయింట్ మెంట్ కోసం నేరుగా గూగుల్ లోకి వెళ్లి వెతికేకంటే.. నేరుగా ఆస్పత్రి అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవాలని పోలీసులు సూచించారు. మీ ఫోన్‌లో ఏదైనా వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని షేర్ చేస్తున్నప్పుడు మీకు అనుమానాస్పదంగా అనిపిస్తే జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.