×
Ad

Karur Stampede: నా గుండె ముక్కలైంది.. కరూర్ తొక్కిసలాట ఘటనపై విజయ్ ఫస్ట్ రియాక్షన్..

గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని విజయ్ అన్నారు.

Karur Stampede: తమిళనాడు కరూర్ లో పెను విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. నటుడు, టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 38 మంది చనిపోయారు. 50 మందికిపైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై విజయ్ స్పందించారు. నా గుండె పలిగింది, ముక్కలైంది అని ఆయన వాపోయారు. తాను అనుభవిస్తున్న బాధను మాటల్లో చెప్పలేకపోతున్నా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నా సోదరులు, సోదరీమణుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా అని అన్నారు. గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని విజయ్ అన్నారు.

కరూర్ తొక్కిసలాట ఘటనలో 38 మంది మరణించారు. వారిలో 10 మంది పిల్లలు ఉన్నారు. 17 మంది మహిళలు ఉన్నారు. శనివారం సాయంత్రం కరూర్ లో టీవీకే బహిరంగ సభ ఏర్పాటు చేశారు. 10వేల మంది వస్తారని అనుకుంటే 50వేల మందికిపైగా జనం, అభిమానులు తరలివచ్చారు. అసలే ఇరుకైన ప్రాంతం కావడం, భారీగా అంచనాలకు మించి జనం రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది.

తొక్కిసలాట ఘటన తర్వాత విజయ్ కరూర్ నుంచి చెన్నైకి వెళ్లిపోయారు. చెన్నై ఎయిర్ పోర్టులో మీడియా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేసింది. కానీ విజయ్ మౌనంగా వెళ్లిపోయారు. తొక్కిసలాట ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత సోషల్ మీడియా ఖాతాలో ఆయన పోస్ట్ పెట్టారు.

శనివారం మధ్యాహ్నానికి విజయ్ కరూర్ చేరుకోవాల్సి ఉంది. కానీ 6 గంటలు ఆలస్యంగా అక్కడికి చేరుకున్నారు. విజయ్ రావడం లేటు కావడంతో అక్కడికి జనం భారీగా తరలివచ్చారు. నిర్వాహాకులు అక్కడ సరైన ఏర్పాట్లు చేయడంలో విఫలం అయ్యారు.

తొక్కిసలాట ఘటన జరిగి 38 మంది చనిపోవడానికి విజయ్ కారకుడయ్యాడని డీఎంకే నేతలు ఆరోపించారు. ఇంత మంది అమాయకులు చనిపోవడానికి కారణమైన విజయ్ ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ దుర్ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

“జనం ప్రాణాలు కోల్పోవడం అందరి హృదయాలను కలచివేసింది. ఈ పూడ్చలేని నష్టాన్ని చవిచూసిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఆసుపత్రుల్లో చేరిన వారందరికీ ఉత్తమ వైద్య చికిత్స అందించాలని ఆదేశించాను. మృతుల కుటుంబాలను కలవడానికి, నా సంతాపాన్ని తెలియజేయడానికి, ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారిని సందర్శించడానికి నేను ఈ రాత్రి కరూర్‌కు ప్రయాణమవుతాను” అని సీఎం స్టాలిన్ తెలిపారు.