పాకిస్తాన్ వెళ్లమన్నందుకు కేంద్ర మంత్రి సీరియస్

  • Publish Date - December 29, 2019 / 02:36 PM IST

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ముస్లింలను  ఉద్దేశించి యూపీ లోని మీరట్ ఎస్పీ అఖిలేశ్ నారాయణ్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ లోని సీనియర్ నేతలు విభిన్నంగా స్పందించారు. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ  ఆవ్యాఖ్యలను ఖండించగా… యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య వాటిని సమర్ధించారు. 
 

ముస్లింలను పాకిస్తాన్ వెళ్లిపొమ్మని మీరట్ ఎస్పీ నిజంగానే అనుచిత వ్యాఖ్యలు చేసి ఉంటే కచ్చితంగా అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని  నక్వీ డిమాండ్‌ చేశారు. సీఏఏ, ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా పెద్ద దేశ వ్యాప్తంగా ఎత్తున ఉద్యమాలు జుగుతున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్‌లోనైతే వేరే చెప్పనక్కర్లేదు. ఈ నిరసనలు హింసాత్మకమవుతూ పలువురు ప్రాణాలు కోల్పోయారు.

కాగా.. మీరట్ ఎస్పీ గో బ్యాక్ టు పాకిస్తాన్ వీడియో వైరల్ కావడం, దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో మైనార్టీల మంత్రిగా నఖ్వీ స్పందించారు. అల్లరిమూకలు కావొచ్చు లేదా పోలీసులే కావచ్చు.. తప్పుచేసిన వాళ్లెవరినీ వదిలిపెట్టొద్దు. 

 

మీరట్ ఎస్పీ కామెంట్లు ముమ్మాటికీ వివాదాస్పదమైనవే. సాక్ష్యాధారాలు పరిశీలించి ఆయనపై చర్యలు తీసుకోవాలి” అని మంత్రి డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి స్థానం లేదని  ఆయన పేర్కొన్నారు.

కాగా గతంలో, పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ మీరట్‌లోని లిసారీ గేటు దగ్గర సీఏఏ నిరసనలు చేస్తున్న ముస్లింలను ఉద్దేశించి ఎస్పీ అఖిలేశ్ నారాయణ్ సింగ్ ఇక్కడ ఉండటం ఇష్టం లేకుంటే పాకిస్తాన్‌ వెళ్లిపోండి ఇక్కడి తిండి తింటూ, పక్కదేశాన్ని పొగడటానికి సిగ్గులేదా? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

 

కాగా ఇదే వీడియో కు సంబంధించి యూపీ డిప్యూటీ సీఎం  కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య సమర్ధించారు. భారత్‌లో ఉండడం​ ఇష్టం లేకపోతే పాకిస్తాన్‌ వెళ్లిపోండి అని అ‍న్న మీరట్‌ ఎస్పీ మాటల్లో తప్పేముందని ఆయన ఎదురు ప్రశ్నించారు.   ఎస్పీ వ్యాఖ్యలు మొత్తం ముస్లిం సమాజానికి వర్తించవని, కేవలం పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసిన వారికే వర్తిస్తాయని, విమర్శించేవారు ఇది గమనించాలని ఆయన కోరారు.

సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో కొందరు పోలీసులపై రాళ్లు విసురుతూ పాకిస్తాన్‌ అనుకూల నినాదాలు చేశారు. వారినుద్దేశించి మాత్రమే ఎస్పీ ఆ మాటలన్నారు. ఇందులో తప్పేముందో అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు.