నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌పై ఈడీ సంచలన ఆరోపణలు

నేషనల్ హెరాల్డ్ కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ED) సంచలన ఆరోపణలు చేసింది.

Sonia gandhi Rahu Gandhi

National Herald case: నేషనల్ హెరాల్డ్ కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ED) సంచలన ఆరోపణలు చేసింది. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల ద్వారా రూ. 142 కోట్లు ఆదాయాన్ని సోనియా, రాహుల్ నేరపూరితంగా లబ్ధిపొందారని పేర్కొంది. ఢిల్లీ ప్రత్యేక కోర్టులో జరిగిన విచారణలో భాగంగా ఈడీ ఈ వాదన వినిపించింది.

 

ఈడీ తరపున అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు మాట్లాడుతూ.. నవంబర్ 2023 వరకు నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని వారు అనుభవిస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఆ సమయంలో కేంద్ర ఏజెన్సీ నేషనల్ హెరాల్డ్ కు సంబంధించిన రూ. 751.9కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిందని అన్నారు. నేర కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని సంపాదించినప్పుడు మాత్రమే కాకుండా, ఆ దాయాన్ని కలిగి ఉండటం ద్వారా కూడా మనీ లాండరింగ్ చేశారని ఈడీ పేర్కొంది. నేరం ద్వారా వచ్చిన డబ్బును స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుందని ఈడీ తెలిపింది.

 

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ‘ఫైమఫీ’ కేసు బనాయించబడిందని కోర్టుకు ఈడీ తెలిపింది. ఈ విషయంలో విచారణ చేపట్టినందున, ప్రాథమికంగా మనీలాండరింగ్ కేసు నమోదైందని పేర్కొంది. నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించి గాంధీలు, సామ్ పిట్రోడా, సుమన్ దూబే మరియు ఇతరులపై మనీలాండరింగ్‌కు సంబంధించి ప్రాథమికంగా రుజువు అయిన కేసు ఉందని ఈడీ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇంతలో న్యాయమూర్తి కల్పించుకొని.. ఫిర్యాదుదారు సుబ్రమణియన్ స్వామికి ఒక కాపీని అందించాలని ఈడీని ఆదేశించారు. 2021లో దర్యాప్తు ప్రారంభించిన తరువాత ఈడీ ఇటీవల తన ఛార్జిషిట్ ను దాఖలు చేసింది.