Nayab Singh Saini: హరియాణా సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం.. హాజరైన మోదీ, చంద్రబాబు.. వీడియోలు వైరల్

హరియాణా ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ గురువారం రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆయనచే ప్రమాణ స్వీకారం చేయించారు.

Haryana CM Nayab Singh Saini

Nayab Singh Saini Oath Taking Ceremony: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హరియాణాలో వరుసగా మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. హరియాణా ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీని బీజేపీ శాసనసభా పక్షం బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. దీంతో ఆయన గురువారం రెండోసారి హరియాణా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నయాబ్ సింగ్ సైనీ చేత గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులుగా అనిల్ విజ్, కృష్ణ లాల్ పన్వార్, రావ్ నర్బీర్ సింగ్, మహిపాల్ దండా, విపుల్ గోయల్, అరవింద్ కుమార్ శర్మ, శ్యామ్ సింగ్ రాణా, రణబీర్ గాంగ్యా, కృష్ణ కుమార్ బేడీతోపాటు పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

Also Read: Drone Summit 2024: అమరావతిలో డ్రోన్ సమ్మిట్.. దేశంలోనే అతిపెద్ద ఈవెంట్.. ఐదు వేలకుపైగా డ్రోన్లతో డ్రోన్‌ షో..

ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ శిండే, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. వీరికితోడు దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన బీజేపీ ముఖ్యనేతలు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు.

 

మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో హరియాణా సీఎంగా సైనీ ఈ ఏడాది మార్చిలో బాధ్యతలు స్వీకరించారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హరియాణాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్ పార్టీ 37 స్థానాలకే పరిమితమైన విషయం తెలిసిందే. దీంతో వరుసగా మూడోసారి బీజేపీ హరియాణాలో అధికారాన్ని చేపట్టేందుకు కావాల్సిన స్థానాలను గెలుచుకుంది. అయితే, సీఎం పదవిపై పలువురు పేర్లను బీజేపీ అధిష్టానం పరిశీలించగా.. చివరకు నయాబ్ సింగ్ సైనీనే సీఎంగా పదవిలో కూర్చొబెట్టేందుకు నిర్ణయించారు. దీంతో గురువారం రెండోసారి సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం చేశారు.