ఫోని తుఫాన్ పై NCMC సమీక్ష

  • Publish Date - May 2, 2019 / 04:31 AM IST

ఫోని తుఫాన్‌ పై జాతీయ సంక్షోభ నివారణ కమిటీ (NCMC)సమీక్షా సమావేశం నిర్వహించింది.  ఒడిశాతో పాటు పశ్చి బెంగాల్, ఏపీలోని ఫోని ప్రభావం ఉందని ఐఎండీ తెలిపింది. దీంతో సహాయక చర్యలను సిద్ధం చేయాలని కేంద్ర, రాష్ట్ర విభాగాలకు ఎన్సీఎంసీ ఆదేశాలు జారీచేసింది. ఇండియన్ కోస్ట్ గార్డ్, నేవీ ఇప్పటికే ముందస్తు సహాయక చర్యలకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో ఏపీలో 12,ఒడిశాలో 28, పశ్చిమ బెంగాల్లో 6 ఎన్నడీఆర్ఎఫ్ బృందాలతో పాటు అదనంగా మరో 32 బృందాలను సిద్ధంగా ఉంచామని అధికారులు తెలిపారు. 

కాగా ఫోనీ తుఫాను బంగాళాఖాతంలో అలజడి రేపుతోంది. మే 3వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం ఒడిశాలోని పూరీ దగ్గర గోపాల్‌పూర్‌ – చాందబలి మధ్య తీరందాటే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఉత్తరాంధ్రలో తుఫాన్‌ ప్రభావం అధికంగా ఉండనుండడంతో అధికారయంత్రాంగం అప్రమత్తమైంది. మే 02వ తేదీ గురువారం ఉత్తర కోస్తా తీరానికి దగ్గరగా రానుంది. ఈ ప్రభావంతో  గంటకు 170 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వాతారణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఈ తుఫాను ప్రభావం ఉండే అన్ని రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాయి.