శివసేన నుంచే సీఎం: ఎన్‌సీపీ కీలక ప్రకటన

  • Publish Date - November 15, 2019 / 09:03 AM IST

ఇరవై రోజులకు పైగా మారుతూ వస్తున్న మహారాష్ట్ర రాజకీయాలు ఎట్టకేలకు ఆఖరికి చేరుకుంటున్నా ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ ఒకే మాట మీదకు రావడంతో సీఎం ఏ పార్టీ వ్యక్తి అనే విషయంలో తెరదించినట్లే అయ్యింది. ఈ మేరకు ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్ ఓ కీలక ప్రకటనను విడుదల చేశారు. ఈసారికి శివసేన నుంచే ముఖ్యమంత్రి ఉంటారంటూ ప్రకటన చేశారు.

శివసేన-ఎన్‌సీపీ-కాంగ్రెస్ మధ్య 40 పాయింట్ల కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ)పై దాదాపు అవగాహన కుదిరడంతో ఎన్‌సీపీ లేటెస్ట్ గా ప్రకటన చేసింది. ‘వారు (శివసేన) అవమానానికి గురయ్యారు. వారి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మాకుంది’. అందుకే శివసేన నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యేందుకు అంగీకరించినట్లు ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్ ప్రకటనలో తెలిపారు.

ఈ క్రమంలోనే రేపు(16 నవంబర్ 2019) మధ్యాహ్నం గవర్నర్ ను మూడు పార్టీల నేతలు కలవనున్నారు. శివసేన-ఎన్‌సీపీ-కాంగ్రెస్ నేతలకు గవర్నర్ ఇప్పటికే సమయం ఇచ్చినట్టు మాలిక్ చెప్పారు. కాగా, శివసేన-ఎన్‌సీపీ-కాంగ్రెస్ మధ్య కనీస ఉమ్మడి ప్రణాళికకు పవార్-సోనియా మధ్య జరిగే భేటిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ముఖ్యమంత్రి పదవిని ఐదేళ్లు శివసేనకు వదలిపెట్టి, కాంగ్రెస్, ఎన్‌సీపీ చెరో డిప్యూటీ సీఎం పదవులను తీసుకుంటారని, మంత్రివర్గంలో శివసేనకు 14, ఎన్‌సీపీకి 14, కాంగ్రెస్‌కు 12 పదవులు దక్కే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం అవగా.. ఇప్పటికే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించింది కేంద్రం.