నేతాజీనా..నటుడా? రాష్ట్రపతి భవన్ లో ఫొటోపై వివాదం

నేతాజీనా..నటుడా? రాష్ట్రపతి భవన్ లో ఫొటోపై వివాదం

Updated On : January 25, 2021 / 6:14 PM IST

Neta-Ji Or Actor నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి(జనవరి-23)ని పరాక్రమ్ దివస్‌గా కేంద్రం ప్రకటించి..దేశవ్యాప్తంగా ఆయన ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. నేతాజీ జయంతి సందర్భంగా కలకత్తా విక్టోరియా మెమోరియల్ వద్ద జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ, బెంగాల్ సీఎం మమత పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే, నేతాజీ 125వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటాన్ని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం ఆవిష్కరించారు. అయితే, ఈ ఫోటో ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమవుతోంది.

రాష్ట్రపతి భవన్ లో కోవింద్ ఆవిష్కరించిన ఫోటో నేతాజీది కాదని.. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా 2019లో తెరకెక్కిన ‘గుమ్నమీ’ సినిమాలో నేతాజీ పాత్ర పోషించిన ప్రసేన్‌జిత్ ఛటర్జీది అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈ ఫోటోపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహౌ మొయిత్రా ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సేవ్‌గాడ్.. రామమందిరానికి రూ.5 లక్షలు విరాళంగా ఇచ్చిన తర్వాత,నేతాజీ బయోపిక్‌లో నటించిన నటుడు ప్రసేన్‌జిత్ చిత్రపటాన్ని ఆవిష్కరించడం ద్వారా రాష్ట్రపతి గౌరవించారు (ఎందుకంటే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చేయలేదు)..ఈ దేశాన్ని దేవుడే రక్షించాలని అన్నారు. భారత రాష్ట్రపతి భవన్ వద్ద నేతాజీ కాదు, నటుడు ప్రసే‌న్‌జిత్ ఛటర్జీ (బుంబాడా) చిత్రపటాన్ని భారత రాష్ట్రపతి ఆవిష్కరించారు. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించిన గుమ్నామి చిత్రంలో బుంబాడా నేతాజీగా నటించారని మరొక నెటిజన్ ట్వీట్ చేశారు.

అయితే, ఈ వివాదాన్ని బీజేపీ వర్గాలు తీవ్రంగా ఖండించాయి. ఈ ఫోటోను నేతాజీ కుటుంబం అందజేసిందని, పద్మశ్రీ గ్రహీత ప్రముఖ చిత్రకారుడు పరేశ్ మైటీ ఈ చిత్రపటాన్ని వేశారని అంటోంది. ఫోటోలో అసలు ప్రసేన్‌జిత్‌‌ పోలికే లేదని, ఇది అనవసరమైన వివాదమని మండిపడుతోంది. అయితే, ఈ చిత్రపటాన్ని నేతాజీ కుటుంబసభ్యులు ఎవరిచ్చారనేది స్పష్టతలేదు. చిత్రకారుడు పరేశ్ మైటీ (56)ది బెంగాల్‌లోని ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా కాగా.. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో నివసిస్తున్నారు.