Covid: కోవిడ్ వ్యాక్సిన్లతో నాడీ సంబంధ సమస్యలు..! నిమ్హాన్స్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు..

29 కేసుల్లో 27 కేసులు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తర్వాత సంభవించాయని కీలక పరిశోధనలు సూచిస్తున్నాయి.

Covid: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (నిమ్హాన్స్)లో నిర్వహించిన క్లినికల్ అధ్యయనాల్లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. కోవిడ్-19 ఇన్ఫెక్షన్, కోవిడ్ టీకాలతో నాడీ సంబంధిత సమస్యలు ముడిపడి ఉన్నట్లు వెల్లడించింది.

NIMHANSలో న్యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ నేత్రావతి నేతృత్వంలో ఈ అధ్యయనాలు జరిగాయి. మహమ్మారి ఫస్ట్ వేవ్, తదుపరి టీకా డ్రైవ్ రెండింటిపైనా స్టడీ చేశారు. వైరస్, దాని ప్రతిస్పందన కేంద్ర నాడీ వ్యవస్థను ఎలా ప్రభావితం చేసిందనే దానిపై స్టడీ జరిగింది. మార్చి నుంచి సెప్టెంబర్ 2020 మధ్య, నాడీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న 3,200 మంది రోగుల ఆసుపత్రి రికార్డులను NIMHANS సమీక్షించింది. వారిలో, 120 మంది రోగుల్లో (3.75%) నాడీ సంబంధిత రుగ్మతలతో కూడిన కోవిడ్ ఇన్ఫెక్షన్లను నిర్ధారించారు. ఈ రోగుల సగటు వయస్సు 49 సంవత్సరాలు.

వీరిలో స్పృహలో మార్పు (47%), మూర్ఛ (21%), అనోస్మియా (14.2%) వంటి లక్షణాలను గుర్తించారు. చాలా మంది రోగులకు (49%) మునుపటి జ్వరం ఉందని రాష్ట్ర వైద్య విద్య మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. కోవిడ్ కారణంగా నాడీ సంబంధిత లక్షణాలు హైపోక్సియా, థ్రోంబోటిక్ సమస్యలు లేదా ఆటో ఇమ్యూన్ కలిగిస్తుందని పరిశోధకులు గుర్తించారు. యాక్టివ్, పోస్ట్-కోవిడ్ దశలలో నాడీ సంబంధిత ఆటంకాలు గమనించబడ్డాయి. కోలుకున్న తర్వాత కూడా ఆ రోగులకు దీర్ఘకాలిక పర్యవేక్షణ అవసరం ఉంది.

Also Read: జలుబు కోసం విక్స్ ఇంహెల్లర్ వాడటం మంచిదేనా? వాడితే ఏమవుతుంది?

అంతేకాకుండా, మే నుండి డిసెంబర్ 2021 వరకు, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న 42 రోజుల్లోపు నాడీ సంబంధిత ఫిర్యాదులు ఉన్న 116 మంది రోగులను NIMHANS అంచనా వేసింది. వీరిలో 29 మంది (25%) మందికి టీకా తర్వాత డీమైలైనేషన్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ పరిస్థితి కేంద్ర నాడీ వ్యవస్థకు నష్టం కలిగిస్తుంది.

29 కేసుల్లో 27 కేసులు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తర్వాత సంభవించాయని కీలక పరిశోధనలు సూచిస్తున్నాయి. రెండు.. కోవాక్సిన్ తర్వాత సంభవించాయి చాలా మంది రోగుల్లో మొదటి డోస్ తర్వాత లక్షణాలు కనిపించాయి. టీకా తీసుకున్న తర్వాత 16 రోజులకు లక్షణాలు కనిపించాయి. మైలోపతి (తీవ్రమైన కుదింపు కారణంగా వెన్నుకు గాయం) అత్యంత సాధారణ లక్షణం (37.9%), తరువాత ఆప్టిక్ న్యూరిటిస్ (20.7%), అక్యూట్ డిస్సెమినేటెడ్ ఎన్సెఫలోమైలిటిస్ (17.2%) (సాధారణంగా ఇన్ఫెక్షన్ తర్వాత సంభవించే నాడీ సంబంధిత పరిస్థితి). చికిత్సతో కోలుకున్న రోగుల్లో ఎక్కువ మందిలో వేరే బ్రాండ్ వ్యాక్సిన్ లేదా రెండవ డోస్ తీసుకున్నప్పుడు ఎటువంటి ప్రతికూలతలు గుర్తించలేదని పరిశోధనలు పేర్కొన్నాయి.

ఈ అధ్యయనం వ్యాధికి గురయ్యే అవకాశం ఉన్న వ్యక్తుల్లో రోగనిరోధక ప్రతిస్పందనను గుర్తించినప్పటికీ, ఈ నాడీ సంబంధిత సంఘటనలు చాలా అరుదు అని నొక్కి చెప్పింది. కోవిడ్, దాని టీకాలకు సంబంధించిన నాడీ సంబంధిత సమస్యలు చాలా అరుదు అయినప్పటికీ నిరంతర పర్యవేక్షణ, పరిశోధన , ప్రజలలో అవగాహన ప్రాముఖ్యతను ఈ పరిశోధనలు నొక్కి చెబుతున్నాయి.

NIMHANS కీలక సిఫార్సులు..

1. కోవిడ్ ఇన్ఫెక్షన్, టీకా దీర్ఘకాలిక నాడీ సంబంధిత ప్రభావాలను ట్రాక్ చేయడానికి దేశవ్యాప్తంగా రిజిస్ట్రీని ఏర్పాటు చేయండి.
2. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం, అధిక స్క్రీన్ వాడకాన్ని తగ్గించడం, శారీరక శ్రమను పెంచడం, తగినంత నిద్ర ద్వారా మెదడు ఆరోగ్యాన్ని ప్రోత్సహించండి.
3. కోవిడ్, టీకా దీర్ఘకాలిక ప్రభావాలపై భవిష్యత్తు పరిశోధన కోసం జీవ నమూనా రిపోజిటరీలను ఉపయోగించుకోండి.