Plasma Therapy: ప్లాస్మా థెరపీపై కొత్త వివాదం.. కేంద్రం సవరణలపై నిపుణుల ఆందోళన!

కరోనా కల్లోలంతో కేంద్రం ఎప్పటికప్పుడు విధివిధానాలను సవరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. డబుల్యుహెచ్ఓ, వివిధ దేశాల వైద్య నిపుణులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలతో కేంద్ర ప్రభుత్వం అనేక కొత్త మందులను కూడా వినియోగానికి తెస్తుంది.

Plasma Therapy: కరోనా కల్లోలంతో కేంద్రం ఎప్పటికప్పుడు విధివిధానాలను సవరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. డబుల్యుహెచ్ఓ, వివిధ దేశాల వైద్య నిపుణులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలతో కేంద్ర ప్రభుత్వం అనేక కొత్త మందులను కూడా వినియోగానికి తెస్తుంది. మరోవైపు కరోనా చికిత్సలో కీలకంగా భావించే ప్లాస్మా థెరపీలో కూడా కేంద్రం కొన్ని సవరణలు చేసింది. అయితే, ఈ కొత్త సవరణలు మరో వివాదానికి దారితీశాయి. సవరణ తర్వాత కొవిడ్​ 19 బాధితులకు ప్లాస్మా చికిత్స అందించడంపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్లాస్మా థెరపీ అంటే కొవిడ్‌ నుంచి కోలుకున్న బాధితుడి రక్తం నుంచి యాంటీబాడీలను సేకరించి, పరిస్థితి విషమంగా ఉన్న కరోనా రోగులకు ఇస్తుంటారు. గత ఏడాది నుండి కొనసాగుతున్న ఈ చికిత్స విధానంపై కేంద్ర ఆరోగ్య శాఖ గత నెలలో సవరించిన మార్గదర్శకాలను జారీ చేసింది. అప్పటి నుంచే దీనిపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. రోగనిరోధక సామర్థ్యం తక్కువగా ఉన్న వారికి ప్లాస్మాను ఇస్తే వైరస్​లో కొత్త రకాలు పుట్టుకొచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి ప్లాస్మా ఇవ్వడం వలన ఆ యాంటీ బాడీలకు లొంగని వైరస్ కొత్త రూపాంతరం చెందుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు ప్లాస్మా చికిత్సను కేంద్రం ‘ఆఫ్​ లేబుల్​’ అని పేర్కొనడాన్ని విమర్శిస్తున్నారు. ప్లాస్మాను ఎలాంటి హేతుబద్ధత లేకుండా, అశాస్త్రీయంగా ఉపయోగించడంతో వైరస్ మరింత బలంగా తయారవుతుందని పలువురు వైద్యులు, శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్రీయ సలహాదారు కె.విజయ్‌ రాఘవన్‌కు లేఖ రాశారు. దీనిపై ప్రముఖ టీకా నిపుణురాలు గగన్‌దీప్‌ కాంగ్‌, శస్త్రచికిత్స నిపుణులు పరమేశ్‌ సి.ఎస్‌, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ బలరామ్‌ భార్గవ, ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా తదితరులు సంతకాలు చేశారు.

ప్లాస్మా థెరపీ వలన కరోనా రోగులకు ఎలాంటి ఉపయోగం లేదని ఇప్పటికే నిపుణులు నిర్ధారించగా సాధారణ పరిస్థితుల్లో ఈ చికిత్స విధానం చేయడం మరింత ఆందోళనకరంగా మారిందని పేర్కొన్నారు. ఏ మాత్రం ప్రభావం చూపని ప్లాస్మా థెరపీతో ప్లాస్మా కోసం రోగి బంధువులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిపుణుల బృందం ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ప్లాస్మాను ‘ఆఫ్‌ లేబుల్‌’ విధానంగా పేర్కొనడం మరింత వింతగా ఉందని నిపుణులు తమ తాజా లేఖలో పేర్కొన్నారు. ‘ఆఫ్‌-లేబుల్‌’ అంటే అనుమతిలేని వినియోగమని అర్ధం. ఒకవైపు ఈ చికిత్సను ఆఫ్ లేబుల్ అంటూనే సవరణలు చేయడాన్ని గందరగోళంగా పేర్కొన్నారు. దీనిపై తక్షణం జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్రీయ సలహాదారు విజయ్‌ రాఘవన్‌ను కోరారు.

ట్రెండింగ్ వార్తలు