New labour codes
New Labour Laws : కేంద్ర ప్రభుత్వం కొత్త లేబర్ చట్టాలను అమల్లోకి తీసుకొచ్చింది. నవంబర్ 21 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. ఉద్యోగులు, కార్మికులు, కంపెనీలు, MSMEలు ఇలా అందరిలోనూ
దీనిపై చాలా సందేహాలు ఉన్నాయి. మీరు జాబ్ చేసే వారు అయితే, మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఐదు అంశాలు ఇందులో ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.
‘వేతనం’ అనే పదానికి మారిన అర్థం ..
కొత్త లేబర్ చట్టాల్లో ‘వేతనం’ అనే దానికి అర్థం పూర్తిగా మారిపోయింది. గతంలో మీ జీతంలో 30శాతమో, 40 శాతమో బేసిక్ శాలరీ ఉండేది. మిగిలినది DA, అలవెన్సులు, పీఎఫ్, అంటూ ఇతరత్రా ఉండేవి. అప్పుడు మీ టేక్ హోమ్ శాలరీ ఎక్కువ వచ్చేది. అయితే, కొత్త చట్టాల ప్రకారం మీ జీతంలో సగం కచ్చితంగా బేసిక్ శాలరీ ఉండాలి. అంటే బేసిక్ శాలరీని ఆధారంగా చేసుకుని పీఎఫ్, ఇతరత్రా కటింగ్స్ ఉంటాయి కాబట్టి బేసిక్ శాలరీ 50శాతం ఉంటే డిడక్షన్స్ పెరుగుతాయన్నమాట. అంటే మీ పీఎఫ్ కటింగ్ ఎక్కువ ఉంటుంది. అయితే, లాంగ్ రన్‌లో చూసుకుంటే మీ పీఎఫ్ పెరుగుతుంది. అంటే రిటైర్మెంట్ సమయానికి మీకు ఆర్థిక భరోసా ఉంటుంది. కేంద్రం ఉద్దేశం కూడా అదే.
గ్రాట్యుటీ 5ఏళ్ల నుంచి ఏడాదికి తగ్గింపు ..
గతంలో ఒక ఉద్యోగి గ్రాట్యుటీకి అర్హత సాధించాలంటే ఆ కంపెనీలో కనీసం ఐదేళ్లు పని చేసి ఉండాలి. ఆ తర్వాత ఏదైనా కారణాలతో రాజీనామా చేసినా, రిటైర్ అయినా, లేకపోతే కంపెనీనే తీసేసినా అప్పుడు ఆ గ్రాట్యుటీ డబ్బు తీసుకోవడానికి వీలుండేది. కొత్త చట్టాల ప్రకారం ఏడాది పాటు పనిచేస్తే గ్రాట్యుటీకి అర్హత సాధిస్తారు. సాధారణంగా కంపెనీలు ఒక ఏడాది, రెండేళ్ల కోసం ప్రాజెక్ట్ ఆధారంగా లేకపోతే షార్ట్ టర్మ్ కోసం ఉద్యోగులను తీసుకుంటాయి. అలా ఉద్యోగాల్లో చేరిన వారికి కూడా ఇది లాభదాయకం. ఆ ప్రాజెక్టు అయ్యాక బయటకు వచ్చే సరికి కొంత గ్రాట్యుటీ వస్తుంది.
అపాయింట్ మెంట్ లెటర్స్ తప్పనిసరి ..
కంపెనీలు ఉద్యోగులను తీసుకునేటప్పుడు అపాయింట్ మెంట్ లెటర్స్ కొన్ని కంపెనీలు ఇస్తాయి. చాలా కంపెనీలు ఇవ్వవు. కానీ, కొత్త లేబర్ చట్టాల ప్రకారం అపాయింట్ మెంట్ లెటర్స్ తప్పనిసరి. అది ఏ రంగానికి చెందిన కంపెనీ అయినా సరే.. అపాయింట్ మెంట్ లెటర్లు లేకుండా ఉద్యోగులను జాబ్ లోకి తీసుకోవడానికి వీల్లేదు. దీని వల్ల ఒక వ్యక్తి కంపెనీలో జాబ్ లో చేరుతుంటే వాళ్ల రోల్ ఏంటి? రెస్పాన్సిబులిటీ ఏంటి? రూల్స్ ఏంటి? జీతం ఎంత అనేది క్లారిటీగా ఉంటుంది.
ఓవర్ టైమ్ చేస్తే డబుల్ పేమెంట్ ..
కొత్త లేబర్ చట్టాల ప్రకారం ఒక ఉద్యోగి లేదా కార్మికుడు ఓవర్ టైమ్ వర్క్ చేస్తే వాళ్లకు కంపెనీ డబుల్ పేమెంట్ ఇవ్వాలి. అలాగే, గతంలో 240రోజులు పనిచేస్తేనే ఉద్యోగులకు వార్షిక సెలవులు కలిసేవి. ఇప్పుడు 180 రోజులు పనిచేస్తే చాలు ఉద్యోగులకు యాన్యువల్ లీవ్స్ కి అర్హత పొందుతారు.
మహిళలకు కూడా నైట్ షిఫ్టులు ..
ఆడ, మగ సమానం. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. అది ఏ రంగంలో కూడా మహిళలకు అన్యాయం జరగకూడదు. లింగ సమానత్వంలో భాగంగా మహిళలకు కూడా నైట్ షిఫ్ట్ డ్యూటీలు చేయడానికి కొత్త లేబర్ చట్టంలో అవకాశం కల్పించారు. అయితే, మహిళలకు రవాణా సదుపాయం కల్పించాలి. మహిళా ఉద్యోగుల భద్రతకు సంబంధించి కంపెనీలు చర్యలు తీసుకోవాలి.
40 ఏళ్లు దాటిన ఉద్యోగులకు ప్రతి ఏడాది హెల్త్ చెకప్స్ ..
కంపెనీలు ప్రతిఏటా ఉద్యోగులకు హెల్త్ చెకప్స్ నిర్వహించాలి.
ప్రతినెలా కచ్చితంగా ఒక తేదీలోపు చెల్లింపులు..
కొన్ని కంపెనీల్లో జీతాలు ఎప్పుడు వస్తాయో తెలీదు. ఒక నెల 10వ తేదీ వస్తే.. మరో నెల 20వ తేదీన వస్తాయి. అయితే, కొత్త లేబర్ చట్టాల ప్రకారం జీతాలు చెల్లింపులకు కంపెనీ ఒక సైకిల్ ఏర్పాటు చేసుకోవాలి. అంటే 1 నుంచి 30వ తేదీ వరకు నెలగా పరిగణిస్తే 7వ తేదీలోపు జీతాలు చెల్లించాలి. అదే 25వ తేదీ నుంచి 24వ తేదీ వరకు లెక్కిస్తే అప్పుడు 31 లేదా తర్వాతి నెల 1వ తేదీ లోపు వేతనాలు చెల్లించాలి.