ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇవాళ(08 ఫిబ్రవరి 2021) సాయంత్రం 5 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలువబోతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహారం, తనపై ప్రివిలేజెస్ కమిటీ సీరియస్ కావడం వంటి విషయాలను గవర్నర్‌ను కలిసి ఆయనకు వివరించే అవకాశం ఉంది. పెద్దిరెడ్డి రమాచంద్రారెడ్డి ఎన్నికల అధికారులను బెదిరించారనే ఆరోపణలపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీరియస్‌గా స్పందిస్తూ.. ఆయనపై ఆంక్షలు విధిస్తూ కఠిన చర్యలకు ఆదేశించారు.
ఈ క్రమంలోనే ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా తీవ్రంగా స్పందించారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసుపై ప్రివిలెజేస్ కమిటీ దృష్టి పెట్టింది. రేపు(09 ఫిబ్రవరి 2021) తొలివిడత పంచాయితీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 3,249 గ్రామాల్లో పోలింగ్ సాగనుంది. దీంతో పోలింగ్ కేంద్రాలకు సామగ్రి తరలింపు.. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది కోసం శానిటైజర్లు, మాస్కులు పంపిస్తున్నారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పర్యటించి, రాష్ట్రంలో సమస్యలపై దృష్టిపెట్టారు. ఐ ఇన్‌ఫెక్షన్ కారణంగా కడప జిల్లా పర్యటన మాత్రం వాయిదా పడగా.. గవర్నర్‌తో భేటి తర్వాత రాష్ట్రంలో ఏం జరగబోతోంది అనేది మాత్రం ఆసక్తికరంగా ఉంది.