నిర్భయ దోషులను వెంటనే ఉరి తీయాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే నిర్భయ దోషులను వీలైనంత త్వరగా ఉరి తీసేందుకు సిద్ధం అయ్యారు అధికారులు. బీహార్ రాష్ట్ర ఖైదీలు ఈ ఉరితాళ్లను సిద్ధం చేస్తున్నారు. ఢిల్లీలోని తీహార్ జైలులో నిర్భయ కేసులో నలుగురు దోషులు ఉన్నారు. వీరికి ఉరి శిక్ష పడగా.. కొంతకాలంగా శిక్ష అమలు కాలేదు.
అయితే ఇటీవల జరిగిన దిశ హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం అవ్వగా.. వారి ఎన్‌కౌంటర్ కూడా నిర్భయ దోషుల ఉరికి డిమాండ్ వచ్చేలా చేసింది. ఈ క్రమంలోనే త్వరలో ఉరి తీసేందుకు అధికారులు కార్యాచరణ మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే బీహార్ రాష్ట్రంలోని బుక్సర్ సెంట్రల్ జైలు ఖైదీలు ఉరితాళ్లు పేనుతున్నారు. గతంలో పార్లమెంటుపై దాడి కేసులో దోషి అఫ్జల్ గురును 2013 ఫిబ్రవరి 9వతేదీన ఉరి తీయగా.. అప్పుడు అఫ్జల్ గురు కోసం కూడా ఉరితాడును బుక్సర్ జైలు ఖైదీలే తయారు చేశారు.
ఈ క్రమంలోనే నిర్భయ దోషుల కోసం కూడా ఉరితాళ్లను ఈ జైలు నుంచే తయారు చేయిస్తున్నారు అధికారులు. బీహార్‌లో గంగా నదీ తీరంలో ఉన్న బుక్సర్ సెంట్రల్ జైలు ఉరితాళ్ల తయారీలో ప్రసిద్ధి చెందింది. గతంలో అఫ్జల్ గురు కోసం పేనిన ఉరితాడును ఈ జైలు నుంచి 1725 రూపాయలకు తీహార్ జైలుకు అమ్మారు. 1930 వ సంవత్సరం నుంచి మనీలా బ్రాండ్ ఉరితాడును బుక్సర్ సెంట్రల్ జైలులోనే తయారు చేస్తున్నారు.
భాగల్ పూర్ సెంట్రల్ జైలులో 1992, 1995 సంవత్సరాల్లో ఉరిశిక్ష విధించినపుడు ఉరితాళ్లను బుక్సర్ జైలు నుంచి సరఫరా చేశారు. 2004వ సంవత్సరంలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అత్యాచారం చేసిన దోషి ధనుంజయ్ చటర్జీని ఉరితీసినపుడు కూడా బుక్సర్ జైలు ఖైదీలు తయారు చేసిన ఉరి తాడునే వాడారు.
2017లో సుప్రీంకోర్టు నిర్భయ దోషులకు ఉరిశిక్ష విధించింది. ప్రస్తుతం నలుగురు దోషులున్నారు. వాళ్లలో ఒకడు క్షమాభిక్ష కోసం పిటిషన్ పెట్టుకున్నాడు. తాజాగా నిర్భయ తల్లి డిమాండ్‌తో ఢిల్లీ గవర్నర్ దోషి పెట్టుకున్న పిటిషన్‌ను తిరస్కరించారు. ఫైలును కేంద్ర హోంశాఖకు పంపగా.. కేంద్ర హోంశాఖ కూడా క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు రాసి రాష్ట్రపతికి ఫైలును పంపింది. దీంతో మరో వారం రోజుల్లోపే నిర్భయ దోషలకు ఉరిశిక్ష విధించే అవకాశం ఉంది.
నిర్భయ దోషులను డిసెంబర్ 16వ తేదీన ఉదయం 5గంటలకు ఉరి తీయనున్నట్లు తెలుస్తుంది. నిర్భయపై ఏరోజైతే అత్యాచారం చేశారో అదే రోజు దోషులను ఉరి తీయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.