ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి జూలై 30న నిసార్ ఉపగ్రహం లాంచ్ కానుంది. ఇస్రో, నాసా సంయుక్తంగా ఈ ఉపగ్రహాన్ని రూ.13,000 కోట్ల (1.5 బిలియన్ డాలర్లు) వ్యయంతో అభివృద్ధి చేశాయి. దీంతో భూమి మొత్తాన్ని 12 రోజుల్లో స్కాన్ చేయవచ్చు. ఇది భూమికి సంబంధించి అత్యంత కచ్చితమైన రీతిలో చిత్రాలను అందించనుంది.
ఇది భారత్, అమెరికాల మధ్య స్పేస్ కోపరేషన్‌లో చారిత్రక ఘట్టంగా చెప్పుకోవచ్చు. నిసార్ అంటే నాసా-ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. ఈ మిషన్ అంతర్జాతీయ స్థాయిలో వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తుల అంచనా, పర్యావరణ పరిశీలనలో విప్లవాత్మక మార్పు తీసుకురానుంది.
నిసార్ ప్రత్యేకత ఏమిటి?
నిసార్ రెండు రాడార్ ఫ్రీక్వెన్సీలతో పనిచేసే ప్రపంచపు మొట్టమొదటి ఉపగ్రహం. నాసా L-బ్యాండ్, ఇస్రో S-బ్యాండ్ వేర్వేరు రాడార్‌లు పనిచేస్తాయి. ఉపగ్రహ బరువు 2,392 కిలోగ్రాములు. దీన్ని ఇస్రో GSLV-F16 ద్వారా 743 కిలోమీటర్ల ఎత్తులో సన్-సింక్రనస్ కక్షలో ప్రవేశపెడతారు. దీంతో ఇది పగలు, రాత్రి, వర్షం వంటి పరిస్థితులకు అతీతంగా స్థిరమైన డేటాను సేకరిస్తుంది. ప్రతి 12 రోజులకు భూమి ఉపరితల చిత్రాలను చాలా స్పష్టతతో తీస్తుంది.
రికార్డు స్థాయి పెట్టుబడి
ఇప్పటివరకు నిర్మించిన భూ పరిశీలన ఉపగ్రహాలలో అత్యంత ఖరీదైనది నిసార్. ఇందులో 12 మీటర్ల పొడవుతో మెష్ యాంటెన్నా, అధునాతన డ్యూయల్ రాడార్ వ్యవస్థ ఉన్నాయి. భూమిపై కిలోమీటర్ స్థాయిలో జరిగే మార్పులను సైతం గుర్తిస్తుంది. భూకంపాలు, హిమనీనదాలు కరిగిపోవడం, భూమి కుంగిపోవడం వంటి అంశాలను అంచనా వేయడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది.
ఇస్రో పాత్ర ఇదే..
ఇస్రో ఈ ప్రాజెక్టులో రూ.788 కోట్లు ఖర్చు చేస్తోంది. చేసిన ఖర్చు కంటే ఇస్రోకు అందే ప్రయోజనాలు ఎక్కువే.
ఈ ప్రయోజనాలు పొందుతాం..
నిసార్ డేటా ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ఇది భారత శాస్త్రీయ, వాతావరణ పరిశోధనకు ప్రపంచంలో గొప్ప స్థానాన్ని అందిస్తుంది. ఈ ఉపగ్రహ ప్రయోగం కేవలం భారత్-అమెరికాకే కాదు, భూమి మొత్తానికి మిషన్‌లాంటిది. మానవతా దృష్టితో రూపొందిన మిషన్ ఇది.
డ్యూయల్ రాడార్‌లు ఎలా పనిచేస్తాయి?