Nitin Gadkari: రాహుల్ గాంధీని ఎవరూ సీరియస్‌గా తీసుకోవద్దు: నితిన్ గడ్కరీ

రాహుల్ గాంధీ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

Union Minister Nitin Gadkari

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సెటైర్లు వేశారు. నవంబర్ 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దీనిపై ఇవాళ నితిన్ గడ్కరీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. “రాహుల్ గాంధీ మాట్లాడుతున్న తీరు చూడండి.. అసలు ఆయనను ఎవరూ సీరియస్‌గా తీసుకోరు. ఆయన వ్యాఖ్యలను ప్రజలు సీరియస్‌గా తీసుకోవద్దు” అని అన్నారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌లా భారత ప్రధాని నరేంద్ర మోదీ జ్ఞాపకశక్తి కోల్పోయారంటూ రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై గడ్కరీ స్పందిస్తూ.. రాహుల్ గాంధీ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశంలో బీజేపీ 400కు పైగా సీట్లు గెలిస్తే.. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని సవరిస్తామనే కట్టుకథను కొందరు సృష్టించారని చెప్పారు.

రాజ్యాంగాన్ని మార్చే ప్రశ్నే లేదని, తాము దాన్ని సవరించబోమని, ఇతరులను ఆ పని చేయనివ్వబోమని అన్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ప్రజలు గ్రహిస్తున్నారని తెలిపారు. అలాగే, ప్రధాని మోదీ నాయకత్వంలో మహారాష్ట్రలో మహాయుతి కూటమికి ప్రజలు మద్దతు ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు.

రాహుల్ గాంధీ కులగణన అంశాన్ని లేవనెత్తుతుండడంపై గడ్కరీ స్పందిస్తూ.. దేశంలో పేదలు, రైతుల సంక్షేమం వంటి విషయాలు చాలా ఉన్నాయని అన్నారు, పేదలకు కులం, మతం లేదని చెప్పారు. ముస్లింతో పాటు ఇతరులకు ఒకే రేటుతో పెట్రోల్ లభిస్తుంది కదా అని చెప్పారు.

చలి చంపేస్తోంది..! దేశవ్యాప్తంగా పెరుగుతున్న చలి తీవత్ర, వణుకు పుట్టిస్తున్న ఐఎండీ హెచ్చరికలు..