Nitin Nabin (Image Credit To Original Source)
Nitin Nabin: భారతీయ జనతా పార్టీ నేత నితిన్ నబిన్ మంగళవారం అధికారికంగా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, పార్టీ ఇతర నేతలు, భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నిక షెడ్యూల్‌ను జనవరి 16న ప్రకటించారు. ఎన్నికల జాబితాను కూడా అదే రోజు విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం నామినేషన్ ప్రక్రియ జనవరి 19న మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరిగింది. జాతీయ అధ్యక్ష పదవికి నితిన్ నబిన్‌కు మద్దతుగా మొత్తం 37 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ వంటి అగ్రనేతలు ప్రతిపాదకులుగా ఉన్నారు.
Also Read: విశాఖ ఉత్సవ్‌కు నేడు శ్రీకారం.. ఏయే కార్యక్రమాలు ఉంటాయో తెలుసా? ఫుల్ డీటెయిల్స్
ఎవరీ నితిన్ నబిన్?
నితిన్ నబిన్ బీజేపీ సీనియర్ నాయకుడు. బిహార్ శాసనసభకు 5 సార్లు ఎన్నికయ్యారు. బిహార్ ప్రభుత్వంలో మాజీ మంత్రి. పార్టీ సంస్థాగత నైపుణ్యం, పరిపాలనా అనుభవం బాగా ఉంది.
ఝార్ఖండ్ రాష్ట్రం రాంచీలో 1980 మే 23న జన్మించిన నబిన్ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2006లో పాట్నా వెస్ట్ శాసనసభ నియోజకవర్గం నుంచి తొలిసారి బిహార్ శాసనసభకు ఎన్నికయ్యారు. 2010 నుంచి బాంకిపూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి వరుసగా 2010, 2015, 2020, 2025 సంవత్సరాల్లో గెలిచి 5 సార్లు ఎమ్మెల్యేగా నిలిచారు. బిహార్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా రోడ్డు నిర్మాణం, పట్టణాభివృద్ధి హౌసింగ్, న్యాయ శాఖల బాధ్యతలను నిర్వహించారు.
శాసనసభ్యుడిగా తన ప్రయాణంతో పాటు పార్టీ సంస్థాగత విభాగంలోనూ నబిన్ కీలక పాత్ర పోషించారు. జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకత్వ బాధ్యతలు నిర్వహించారు. సిక్కిం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత బాధ్యతలు అప్పగించారు.