Nitish Kumar Bihar Politics : నితీశ్ వ్యవహారం.. మొత్తం ఇండియా కూటమిపైనే ప్రభావం.. వచ్చే ఎన్నికల్లో బీహార్ ప్రజలు ఎటు మొగ్గుచూపుతారో..?!

Nitish Kumar Bihar Politics : వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీహార్ ప్రజల ఆలోచనాతీరును కూడా మార్చవచ్చు. ఇలాంటి జంపింగ్ రాజకీయాలకు చోటివ్వకుండా...ఒకే పార్టీకి లేదా కూటమికి స్పష్టమైన మెజార్టీ కట్టబెట్టేదిశగా బీహార్ ప్రజలు ఓటువేసే పరిస్థితులు రావొచ్చు.

Nitish Kumar’s U-turn will have implication not just for Bihar but for national politics

Nitish Kumar Bihar Politics : ఇండియా కూటమి నా అంచనాలు చేరుకోలేకపోయింది. అలాగే బీహార్ అధికారకూటమిలో పరిస్థితులు బాగా లేవు. అందరి సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాతే….ఈ నిర్ణయానికి వచ్చాను. ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమితో రాష్ట్రస్థాయిలో, ఇండియా కూటమితో జాతీయ స్థాయిలో తెగతెంపులు చేసుకున్న తర్వాత నితీశ్‌కుమార్ చెప్పిన మాటలివి. పల్టీరామ్ అన్న విమర్శలు తీవ్రమయినప్పటికీ… ఆయారామ్, గయారామ్‌లానే నితీశ్‌ను చూడాలని మల్లికార్జున ఖర్గే అన్నప్పటికీ.. ఈ పరిణామాలను అంత తేలిగ్గా తీసుకోకూడదు. నితీశ్ వ్యవహారం.. మొత్తం ఇండియా కూటమిపై ప్రభావం చూపుతుంది. అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీహార్ ప్రజల ఆలోచనాతీరును కూడా మార్చవచ్చు. ఇలాంటి జంపింగ్ రాజకీయాలకు చోటివ్వకుండా…ఒకే పార్టీకి లేదా కూటమికి స్పష్టమైన మెజార్టీ కట్టబెట్టేదిశగా బీహార్ ప్రజలు ఓటువేసే పరిస్థితులు రావొచ్చు.

Read Also : JDU INDIA Alliance : ఇండియా కూటమితో జేడీయూ ఎందుకు తప్పుకుందంటే? అసలు కారణం ఇదేనంటున్న పార్టీ సీనియర్ నేత

మెజార్టీ కాంగ్రెస్-ఆర్జేడీ కూటమికి లభించలేదు :
243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 122 స్థానాలు కావాలి. 2020 ఎన్నికల్లో 75 స్థానాలతో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా నిలవగా, 74 స్థానాలతో బీజేపీ తర్వాతి స్థానంలో నిలిచింది. 19 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ కాంగ్రెస్-ఆర్జేడీ కూటమికి లభించలేదు. 43 స్థానాల్లో గెలుపొందిన జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ 2020లో ఓసారి, 2022లో మరోసారి 2024లో ఇంకోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అతిపెద్ద రాజకీయపార్టీగా నిలిచిన ఆర్జేడీకానీ, తర్వాతి స్థానంలో నిల్చిన బీజేపీ కానీ ముఖ్యమంత్రి పదవికి నోచుకోలేకపోయాయి. కానీ 43 స్థానాలు మాత్రమే గెల్చిన జేడీయూ నేత నితీశ్‌కుమార్ మాత్రం మార్చి మార్చి సీఎం పదవి చేపట్టగలిగారు. నితీశ్ రాజకీయ చాణక్యతకే కాదు.. బీహార్ రాజకీయాల వైచిత్రికి కూడా ఈ ఘటనలు నిదర్శనం.

బీజేపీ తరపున ఒక్క సీఎం కూడా లేరు :
20 ఏళ్ల కాలంలో ఒక్క ఏడాది మినహా మిగిలిన కాలమంతా నితీశ్ కుమారే బీహార్ ముఖ్యమంత్రి. అంతకుముందు…1990 నుంచి 2005 అంటే..15ఏళ్ల కాలంలో ఒక్క వారం రోజులు మినహా మిగిలిన కాలమంతా లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి ముఖ్యమంత్రులుగా ఉన్నారు. 35ఏళ్ల కాలంలో బీహార్ రాజకీయాలన్నీ లాలూ కుటుంబం, నితీశ్ కుమార్ చుట్టూనే తిరుగుతున్నాయి. 2005లో అధికారం కోల్పోయిన తర్వాత ఆర్జేడీ తిరిగి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుచేయలేకపోయింది. అలాగే 35 ఏళ్లగా జనతాదళ్, రాష్ట్రీయ జనతాదళ్, జనతాదళ్ యు పార్టీల నేతలు ముఖ్యమంత్రులయ్యారు. ప్రధాన జాతీయ పార్టీలయిన కాంగ్రెస్, బీజేపీ తరపున ఒక్క సీఎం కూడా 35 ఏళ్ల కాలంలో లేరు. దక్షిణాదిన కొన్ని రాష్ట్రాల తరహాలో ఎన్నికలు జరిగిన ప్రతిసారీ అధికారపార్టీ మారడం బీహార్‌లో లేదు. తాము నమ్మిన నేతను పలుమార్లు అవకాశం కల్పించడం బీహార్ ప్రజల లక్షణం. అయితే ఈ లక్షణాన్ని రాజకీయనేతలు తమ ఇష్టానుసారం వాడుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ముందు లాలూ ఆయన కుటుంబం, తర్వాత నితీశ్ బీహార్‌ను తమ సొంత ఆస్తిగా భావిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి.

రెండు పార్టీల మధ్య చిరకాల మైత్రీ బంధం :
ఇక మరోసారి కూటమి కట్టిన BJP, JDU స్నేహాన్ని పరిశీలిస్తే… ఈ రెండు పార్టీల మధ్య చిరకాల మైత్రీ బంధమే ఉంది. కానీ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండనట్టే..శాశ్వత మిత్రులు కూడా ఉండరని ఈ రెండు పార్టీలు నిరూపించాయి. BJP ప్రధాని అభ్యర్థిగా మోదీని ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ 2014లో నితీశ్‌కుమార్ NDAకు దూరం జరిగారు. అయితే 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు నితీశ్ సీఎం బాధ్యతలు స్వీకరించేందుకు వీలుగా అప్పటి ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ రాజీనామా చేయాలని పార్టీ ఆదేశిస్తే…నితీశ్‌ సీఎం కాకుండా అడ్డుకునేందుకు మాంఝీకి మద్దతిచ్చేందుకు బీజేపీ సిద్ధపడింది.

అలాగే నితీశ్ చిరకాల ప్రత్యర్థిపార్టీలయిన జేడీయూ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేశారు. మహఘట్‌బంధన్ పేరుతో ఆ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుని 2015 ఎన్నికల్లో గెలుపొందారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌తో విభేదాలు రాగానే నితీశ్‌కు బీజేపీ మద్దతిచ్చింది. 2020 ఎన్నికల తర్వాత కూడా ఆ పొత్తు కొనసాగింది. ఈ పరిణామాలన్నింటి తర్వాత 2022లో నితీశ్..తెగతెంపులు చేసుకోవడం బీజేపీకి ఆగ్రహం తెప్పించింది. NDA తలుపులు నితీశ్‌కు శాశ్వతంగా మూసివేయాలన్న నిర్ణయానికి బీజేపీ వచ్చింది. కానీ రెండేళ్లలో పరిణామాలు మారిపోయాయి. దీంతో ఇప్పుడు NDA తలుపులను నితీశ్‌ కోసం మరోసారి తీయక తప్పని పరిస్థితి బీజేపీకి ఏర్పడింది.

2025 బీహార్ ఎన్నికల్లో కూటమి విజయం తధ్యం :
జేడీయూ, బీజేపీ సహజ మిత్రపక్షాలని బీజేపీ అధినేత జేపీ నడ్డా అంటున్నారు. ఎక్కడినుంచి వెళ్లానో అక్కడికే తిరిగి వచ్చానని నితీశ్‌కుమార్ అంటున్నారు. ఇక తానెక్కడికీ వెళ్లబోనని చెబుతున్నారు. బీజేపీ-జేడీయూ కూటమి తక్షణ లక్ష్యం బీహార్ లోక్‌సభ ఎన్నికల్లో వీలయినన్ని ఎక్కువసీట్లు గెలవడం. 40 స్థానాలు తమ కూటమి గెలుచుకుంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. 2025 బీహార్ ఎన్నికల్లో కూడా తమ కూటమే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేస్తున్నారు జేపీ నడ్డా. ఇండియా కూటమిపై ప్రభావం ఉంటుందని తెలిసినప్పటికీ.. ఇదంతా ఆయారామ్ గయారామ్ రాజకీయాలని.. పరిస్థితి తీవ్రతను తగ్గించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు.

ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేసేందుకే డ్రామా :
ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారమే ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేసేందుకే బీజేపీ-జేడీయూ కలిసి ఈ డ్రామా ఆడాయని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. తాను చెప్పింది చేస్తానంటున్నారు ఆర్జేడీ నేత తేజస్వియాదవ్. ఆట ఇప్పుడే మొదలైందని… 2024 ఎన్నికల్లో జేడీయూ తుడిచిపెట్టుకుపోతుందని తేజస్వియాదవ్ చెప్పారు. అయితే తాజా పరిణామాల తర్వాత బీహార్ ప్రజల ఆలోచనల్లో మాత్రం మార్పు వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలా పదే పదే పార్టీలు, కూటములు మార్చే అవకాశం లేకుండా ఒకే పార్టీకి స్పష్టమైన మెజార్టీ కట్టబెట్టేదిశగా ప్రజలు ఓటువేసే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

Read Also : Nitish Kumar: నిజాయితీ, నిరాడంబరతకు అప్పుడు నితీశ్ మారుపేరు.. ఇప్పుడు ఎందుకు మారిపోయారో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు