×
Ad

దీపావళికి బోనస్‌ ఇవ్వలేదని రచ్చ రచ్చ చేసిన ఉద్యోగులు.. చివరకు కంపెనీ ఏం చేసిందో తెలుసా?

పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితులను అదుపులోకి తెచ్చారు.

Diwali bonus

ఉత్తరప్రదేశ్‌లోని ఫతేహాబాద్‌ వద్ద సోమవారం వేలాది వాహనాలు ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌ వేలో టోల్‌ చెల్లించకుండా వెళ్లాయి. దీపావళి బోనస్‌పై అసంతృప్తిగా ఉన్న ఉద్యోగులు అన్ని గేట్లు తెరిచి వాహనాలను వదిలేయడంతో ఈ పరిస్థితి నెలకొంది.

ఉద్యోగుల నిరసనతో టోల్‌ కార్యకలాపాలు, రవాణా వ్యవస్థకు అంతరాయం ఎదురైంది. ఫతేహాబాద్‌ టోల్‌ ప్లాజాలో పని చేసే 21 మంది ఉద్యోగులు రూ.1100 మాత్రమే బోనస్‌గా ఇచ్చారని అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ నిరసన తెలిపారు. ఆ మాత్రం డబ్బు ఇవ్వకపోయినా ఒకటేనని అన్నారు.

శ్రీ సైన్‌ అండ్‌ డాటార్‌ కంపెనీ ఈ ఏడాది మార్చిలో టోల్‌ నిర్వహణను చేపట్టింది. పండుగ బోనస్‌ లెక్కింపు, పంపిణీపై అప్పటి నుంచే వివాదాలు కొనసాగుతున్నాయి. మరింత బోనస్‌ కావాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగులు సమష్టిగా పనులు నిలిపివేశారు.

Also Read: దేశంలోనే ఇంత వరస్ట్ ఏఎస్పీని నేనెక్కడా చూడలేదు.. ఈయన పనికిరాడు: జేసీ ప్రభాకర్ రెడ్డి

ఫలితంగా అన్ని టోల్‌ గేట్లు తెరిచి ఉండడంతో వేలాది వాహనాలు టోల్‌ చెల్లించకుండా వెళ్లిపోసాగాయి. నిర్వాహకులు ఇతర ప్లాజాల నుంచి సిబ్బందిని తీసుకువచ్చి పనులు కొనసాగించేందుకు ప్రయత్నించారు. కానీ, నిరసన తెలుపుతున్న ఉద్యోగులు వారిని పనిచేయనీయలేదు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది.

ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. కంపెనీ ప్రతినిధులు ఉద్యోగులతో చర్చలు జరిపి వెంటనే 10 శాతం జీతం పెంచుతామని ప్రకటించారు. ఈ హామీతో ఉద్యోగులు తిరిగి పనిలో చేరారు. రెండు గంటల అంతరాయం తర్వాత టోల్‌ కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చాయి. శ్రీ సైన్‌ అండ్‌ డాటార్‌ కంపెనీ తాము మార్చిలో ఒప్పందం చేపట్టడంతో ఉద్యోగులకు ఏడాది బోనస్‌ ఇవ్వలేమని స్పష్టం చేసింది.