మహారాష్ట్రలో “దుష్యంత్” లేరు…స్వరం పెంచిన శివసేన

మహారాష్ట్రలో బీజేపీ-శివసేన ప్రభుత్వానికి మెజార్టీ వచ్చినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటులో ఇంకా ముందడుగు పటినట్లు కన్పించడం లేదు. 50-50 ఫార్మూలా కింద చెరో రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకోవాల్సిందేనని పట్టుబడుతున్న శివసేన తన వాదనకు మరింత పదునుపెట్టింది. హర్యానా తరహా మోడల్ మహారాష్ట్రలో కుదరదని మంగళవారం(అక్టోబర్-29,2019) వివసేన తేల్చిచెప్పంది.

శివసేన ముఖ్యనాయకుడు సంజయ్ రౌత్ మాట్లడుతూ…మహారాష్ట్రలో ‘దుష్యంత్’లు లేరని, అతడి తండ్రి జైలులోనూ లేడని బీజేపీపై సెటైర్లు వేశారు. హర్యానాలో దుష్యంత్‌ చౌతాలా నేతృత్వంలోని జేజేపీతో కలిసి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విసయం తెలిసిందే. దుష్యంత్ చౌతాలా హర్యానా డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విసయం తెలిసిందే. దుష్యంత్ తండ్రి అజయ్ చౌతాలా ఉద్యోగాల నియామకాల స్కామ్‌లో జైలుకు వెళ్లి…ఇటీవల 14 రోజుల పెరోల్‌పై బయటకు వచ్చిన విషయం విదితమే.

లోక్‌సభ ఎన్నికల పొత్తుకు ముందే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 50-50 ఫార్ములాను బీజేపీ ఒప్పుకుందని, ఇప్పుడు బీజేపీ మాట నిలుపుకోవాల్సిందేనని శివసేన పట్టుబడుతోంది.  అయితే బీజేపీ మాత్రం సీఎం పోస్ట్ విషయంలో సమప్రాధాన్యం కుదరదంటోంది. దీంతో రెండు భాగస్వామ్య పార్టీలు ఇండిపెండెంట్లకు గాలం వేస్తూ వేగంగా పావులు కదుపుతున్నాయి. కాంగ్రెస్-ఎన్‌సీపీ కూటమితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలను శివసేన తోసిపుచ్చనప్పటికీ బీజేపీతో మైత్రీ బంధానికే తమ ప్రాధాన్యత అంటోంది. ఇదే సమయంలో రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చన్న సంకేతాలు కూడా ఇస్తోంది.
 
తమకు ఇతర ఆప్షన్లు ఉన్నప్పటికీ ప్రత్నామ్నాయ మార్గాలను అంగీకరించడం సబబు కాదని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే అభిప్రాయపడుతున్నట్టు సంజయ్ రౌత్ తెలిపారు. తమకు ఎలాంటి అధికార దాహం లేదని, సత్యసంధత కలిగిన రాజకీయాలను మాత్రమే శివసేన కోరుకుంటుందని ఆయన తెలిపారు.