Guidelines For Coaching Centres : కోచింగ్ సెంటర్ల అతి ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలని కేంద్ర సర్కార్ నిర్ణయించింది. నూటికి నూరు శాతం జాబ్ గ్యారెంటీ లాంటి ప్రకటనలు ఇకపై కనిపించకూడదని కోచింగ్ సెంటర్లను కేంద్రం హెచ్చరించింది. ఇలాంటి మోసపూరిత, అవాస్తవ ప్రకటనలతో కోచింగ్ సెంటర్లు అభ్యర్థులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న కోచింగ్ సెంటర్లకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇక సేవలు, సౌకర్యాలు, వనరులు, మౌలిక వసతుల గురించి వాస్తవాలు చెప్పాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
కోర్సులకు ఏఐసీటీఈ, యూజీసీ వంటి సంస్థల అనుమతులు, గుర్తింపు అవసరమైతే ఆ విషయాన్ని స్పష్టంగా పేర్కొనాలని సూచించింది. ఆ అనుమతులు అన్నీ ఉన్నట్లు చెప్పాలంది. ప్రకటనల తయారీలో పారదర్శకత పాటించాలని కేంద్రం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే నేషనల్ కన్య్సూమర్ హెల్ప్ లైన్ లో భాగస్వామి కావడానికి ప్రతి కోచింగ్ సెంటర్ ప్రయత్నించాలంది. నిబంధనలు ఉల్లంఘిస్తే వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019 కింద చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. బాధ్యులైన వ్యక్తులు, సంస్థలపై జరిమానాలు విధించడంతో పాటు నిర్దిష్టమైన జవాబుదారితనాన్ని ఖరారు చేసి భవిష్యత్తులో అలాంటి తప్పులు జరక్కుండా చూస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.
ఇక దీనిపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అంతిమ మార్గదర్శకాలను కేంద్రానికి సమర్పించింది. అడ్డగోలుగా ప్రకటనలు ఇస్తూ, ఆంక్షలను ఉల్లంఘించి నడుపుతున్న కోచింగ్ సెంటర్స్ కు సీసీపీఏ ఇప్పటికే 54 నోటీసులను జారీ చేసింది. 54 లక్షల 60వేల రూపాయల జరిమానా కూడా విధించింది. ఇక సెలక్షన్ తర్వాత జాబ్ వచ్చాక అభ్యర్థుల నుంచి ఎలాంటి రాతపూర్వక అంగీకారం తీసుకోకుండా వారి పేర్లను, ఫోటోలను, ఇతర డీటైల్స్ ను తమ ప్రకటనల్లో కోచింగ్ సెంటర్లు వాడకూడదని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది కేంద్రం.
అలాగే చాలామంది యూపీఎస్సీ అభ్యర్థులు ప్రిలిమ్స్, మెయిన్స్ ను స్వతహాగా కష్టపడి చదువుకుని కేవలం ఇంటర్వ్యూ గైడెన్స్ మాత్రమే కోచింగ్ సెంటర్ల నుంచి తీసుకుంటారని.. కన్య్యూమర్ అఫైర్స్ సెక్రటరీ నిధి ఖరే తెలిపారు. ఇలాంటి అభ్యర్థుల ఫోటోలతో ప్రకటనలు చేసి.. తమ కోచింగ్ సెంటర్ల వల్లే వారు సివిల్స్ క్లియర్ చేసినట్లుగా ప్రచారం చేసుకుంటాయని, ఇది చట్టరిత్యా నేరం అని తెలిపారామె.
Also Read : మస్క్‌కు బిగ్‌షాక్.. ‘ఎక్స్’ను వీడి బ్లూ స్కై, థ్రెడ్స్ సైట్‌లలోకి వినియోగదారులు.. ఎందుకంటే?