×
Ad

అజిత్ పవార్ విమాన ప్రమాదం: మేడే కాల్‌ రాలేదు.. రన్‌వే కనిపించడంలో పైలట్లకు ఇబ్బందులు.. డీజీసీఏ ఏం చెప్పింది?

ఉదయం 8.43 గంటలకు ల్యాండ్ అయ్యేందుకు అనుమతి ఇచ్చారు. ల్యాండింగ్ క్లియరెన్స్‌కు రీడ్‌బ్యాక్ మాత్రం రాలేదు.

Ajit Pawar Plane Crash (Image Credit To Original Source)

  • బారామతిలో ఉన్నది ఒక అన్‌కంట్రోల్డ్ ఎయిర్‌ఫీల్డ్..
  • బారామతి సిబ్బందిని ఉదయం 8.18 గంటలకు సంప్రదించిన పైలట్
  • పైలట్ నిర్ణయానుసారం దిగవచ్చని బారామతి సిబ్బంది సూచన

Ajit Pawar: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదానికి ముందు మేడే కాల్‌ రాలేదు.. రన్‌వే కనిపించడంలో పైలట్లకు ఇబ్బందులు ఎదురయ్యాయి. బారామతిలో విమానం ల్యాండింగ్ సమయంలో ఏం జరిగిందన్న విషయంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) పలు వివరాలు తెలిపింది.

డీజీసీఏ తెలిపిన వివరాల ప్రకారం.. మొదటి ప్రయత్నంలో రన్‌వే కనిపించకపోవడంతో పైలట్లు గో అరౌండ్ చేసి, రెండోసారి ల్యాండింగ్ ప్రయత్నం చేశారు. సిబ్బంది మేడే కాల్ ఇవ్వలేదు. గో అరౌండ్ అంటే ల్యాండింగ్ విఫలమైతే మళ్లీ విమానాన్ని పైకి తీసుకెళ్లి మరోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించే ప్రక్రియ. మేడే కాల్ అంటే అత్యవసర పరిస్థితిని తెలియజేసే అంతర్జాతీయ విమాన సంకేతం.

ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న వీఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తున్న లియర్‌జెట్ 45 బిజినెస్ విమానం బారామతి ఎయిర్‌ఫీల్డ్‌లో ల్యాండింగ్ ప్రయత్నంలో కూలింది. తక్కువ దూరం ఉండే కమర్షియల్‌ జర్నీకి ఉపయోగించే తేలికపాటి జెట్ విమానమే లియర్‌జెట్ 45.

Also Read: అజిత్ పవార్ విమాన ప్రమాదం.. లాస్ట్ మినిట్‌లో ఏం జరిగింది?

విమానానికి కేటాయించే అధికారిక నమోదు సంఖ్య (వీటీ ఎస్‌ఎస్‌కే) కూడా ఈ విమానానికి ఉంది. ఈ విమానం ముంబై-బారామతి మధ్య ప్రయాణిస్తుండగా ఉదయం 8.44 గంటలకు ప్రమాదానికి గురైంది.

బారామతిలో ఉన్నది ఒక అన్‌కంట్రోల్డ్ ఎయిర్‌ఫీల్డ్. అంటే పూర్తి స్థాయి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ లేకుండా పనిచేసే ఎయిర్‌ఫీల్డ్ (విమానాశ్రయం). ఇక్కడ ట్రాఫిక్ సేవలు, సమాచారాన్ని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కాకుండా ఫ్లయింగ్ ట్రైనింగ్ సంస్థలు అందిస్తాయి.

విమాన సిబ్బంది ఉదయం 8.18 గంటలకు బారామతి సిబ్బందిని సంప్రదించింది. పుణె అప్రోచ్ నుంచి విడుదలైన తర్వాత 30 నాటికల్ మైళ్లు దూరంలో ఉన్నట్టు సమాచారం ఇచ్చింది. పైలట్ నిర్ణయానుసారం విజువల్ మెటీరియాలజికల్ కండిషన్స్‌లో దిగవచ్చని బారామతి సిబ్బంది సూచించారు.

దృశ్యమానత సుమారు 3,000 మీటర్లు ఉన్నట్టు చెప్పారు. గాలులు ప్రశాంతంగానే ఉన్నాయి. రన్‌వే 11పై మొదటి ప్రయత్నంలో వాతావరణ పరిస్థితుల కారణంగా రన్‌వే సరిగ్గా కనిపించలేదని చెప్పి విమానం గో అరౌండ్ చేసింది.

“రెండో ప్రయత్నంలో కూడా రన్‌వే కనిపించలేదని సిబ్బంది తెలిపారు. అనంతరం కనిపిస్తోందని చెప్పారు. ఉదయం 8.43 గంటలకు ల్యాండ్ అయ్యేందుకు అనుమతి ఇచ్చారు. ల్యాండింగ్ క్లియరెన్స్‌కు రీడ్‌బ్యాక్ మాత్రం రాలేదు.

కొన్ని క్షణాల తర్వాత రన్‌వే 11 థ్రెషోల్డ్ (రన్‌వే ప్రారంభ అంచు) సమీపంలో మంటలు కనిపించాయి. థ్రెషోల్డ్‌కు ఎడమ వైపు రన్‌వే వద్ద శకలాలు లభించాయి” అని డీజీసీఏ ప్రకటనలో తెలిపింది. రీడ్‌బ్యాక్ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆదేశాన్ని పైలట్ తిరిగి చదివి నిర్ధారించడం.

వీఎస్ఆర్ వెంచర్స్ నాన్ షెడ్యూల్డ్ ఆపరేటర్. ఆ సంస్థ వద్ద లియర్‌జెట్ 45లు ఏడు సహా మొత్తం 17 విమానాలు ఉన్నాయి. 2025 ఫిబ్రవరిలో జరిగిన చివరి రెగ్యులేటరీ ఆడిట్‌లో లెవల్-I లోపాలు (అత్యంత తీవ్రమైన భద్రతా లోపాలు) ఏవీ లేవని డీజీసీఏ తెలిపింది.