కరోనావైరస్‌ ఎఫెక్ట్: దేశవ్యాప్తంగా రైళ్లు రద్దు

  • Publish Date - March 20, 2020 / 05:54 PM IST

చైనాలో పుట్టి ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా వైరస్.. రోజురోజుకి ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. ఈ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోండగా.. ఇప్పటివరకు 249 మంది వ్యక్తులు కరోనాతో బాధపడుతున్నట్లు కేంద్రం ప్రకటన చేసింది. ఇవాళ ఒక్కరోజే దేశవ్యాప్తంగా 29 కొత్త కేసులు నమోదవగా.. రాష్ట్రాలు హై అలర్ట్ ప్రకటించాయి. 

ఈ క్రమంలోనే కరోనా వ్యాప్తి కట్టడి చేసేందుకు జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. మార్చి 22వ తేదీన ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండి ఈ నిర్ణయానికి మద్దతు తెలపాలని కోరారు. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా రైళ్లు కూడా నిలిపివేయనున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం.

శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి 10 గంటల వరకు ఏ ప్యాసింజర్ రైలు బయలుదేరబోదని రైల్వేశాఖ స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో 2వేల 400 ప్యాసింజర్ రైళ్లు నిలిచిపోతున్నాయి. అయితే అప్పటికే ప్రయాణంలో ఉన్న రైళ్లను మాత్రం గమ్యస్థానాలు చేరే వరకు అనుమతి ఇస్తారు. అంతేకాదు దూరప్రాంతాలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ఇంటర్‌సిటీ రైళ్లను కూడా రద్దు చేసింది రైల్వేశాఖ.

మార్చి 22న ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఏ ఎక్స్‌ప్రెస్ రైలు తిరగబోదని వెల్లడించింది రైల్వేశాఖ. దీంతో 1300 ఎక్స్‌ప్రెస్ రైళ్ల సర్వీసులు రద్దు కానున్నాయి. అప్పటికే ప్రయాణంలో ఉన్న ఎక్స్‌ప్రెస్ రైళ్లు మాత్రం గమ్యస్థానాలకు చేరుతాయి. ఆదివారం రద్దయ్యే రైళ్లలో ఇప్పటికే బుక్కైన టికెట్లు ఆటోమేటిగ్గా క్యాన్సిల్ అవుతాయని, డబ్బులను తిరిగి ప్రయాణికులకు అందజేస్తామని రైల్వేశాఖ ప్రకటించింది.