ఈనెల 14 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణపై ఉభయసభల కార్యదర్శులు బులెటిన్ విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలను వేరు వేరు సమయాల్లో నిర్వహించనున్నారు. సోషల్ డిస్టాన్సింగ్ పాటించే ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నారు.
తొలిరోజు లోక్‌సభ కార్యకలాపాలు ఉదయం జరగనుండగా.. ఆ తర్వాతి నుంచి మధ్యాహ్నం జరగనున్నాయి. ఇదే విధంగా రాజ్యసభ తొలిరోజు మధ్యాహ్నం, తర్వాతి రోజుల్లో ఉదయం నిర్వహించనున్నారు. ఉభయ సభలు నాలుగు గంటల చొప్పున భేటీ కానున్నాయి. అక్టోబర్-1న సమావేశాలు ముగియనున్నాయి. సభా కార్యకలాపాలకు హాజరయ్యే ఎంపీలు కరోనా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్లు పార్లమెంట్లో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
సెప్టెంబర్ 14 ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు లోక్‌సభ సమావేశాలు జరగనుండగా.. ఆ తర్వాతి రోజుల్లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 వరకు లోక్‌సభ కార్యకలాపాలు ఉంటాయి.ఇదే విధంగా తొలిరోజు(సెప్టెంబర్ 14) మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 వరకు రాజ్యసభ సమావేశాలు నిర్వహించనుండగా.. మిగతా రోజుల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాజ్యసభ సమావేశాలు నిర్వహిస్తారు.
అయితే, మొత్తం సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేస్తూ రాజ్యసభ ఛైర్మన్, లోక్‌సభ స్పీకర్ ఉత్తర్వులిచ్చారు. సాధారణం సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. ఈసారి ఆ క్వశ్చన్ అవర్‌ను రద్దు చేశారు. ప్రైవేటు మెంబర్స్ బిజినెస్ ఉండదు. అయితే శూన్యగంట(జీరో అవర్) యథావిధిగా కొనసాగనుంది.
విపక్షాల ఆగ్రహం
కాగా, క్వశ్చన్ అవర్ ను ఎత్తివేయడాన్ని విపక్ష ఎంపీలు తప్పుపడుతున్నారు. మహమ్మారిని అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేస్తున్నారని తృణముల్ కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ విమర్శించారు. దీంతో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును విపక్ష నేతలు కోల్పోయారన్నారు. 1950 నుంచి ఇలా జరగడం ఇదే మొదటిసారన్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి కూడా స్పీకర్ ఓం బిర్లాకు తన నిరసన వ్యక్తం చేశారు.
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ ఓ ట్వీట్ లో… ప్రభుత్వాన్ని ప్రశ్నించడం.. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం యొక్క ఆక్సిజన్. పార్లమెంటును నోటీసు బోర్డుగా తగ్గించాలని ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ప్రభుత్వం… తాను అనుకున్నది బిల్లు పాస్ చేయించుకునేందుకు తన అణిచివేత మెజారిటీని రబ్బర్-స్టాంప్ వలె ఉపయోగిస్తుంది. జవాబుదారీతనం ప్రోత్సహించడానికి ఉన్న ఒక మెకానిజంను తొలగించారు అని థరూర్ తెలిపారు.
అందుకే ఆలా.. రాజ్ నాథ్
మరోవైపు, ప్రశ్నోత్తరాల సమయాన్ని కేటాయిస్తే, అప్పుడు వాటికి సమాధానాలు ఇచ్చేందుకు ఆయా మంత్రిత్వశాఖ అధికారులు పార్లమెంట్‌కు రావాల్సి ఉంటుందని, దాంతో విజిటర్స్ సంఖ్య పెరుగుతుందని, కోవిడ్ సమయంలో ఇది సరికాదు అని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఈ విషయమై కాంగ్రెస్ నాయకులు గులాం నబీ ఆజాద్ మరియు అధీర్ రంజన్ చౌదరి, మరియు టిఎంసి ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ సహా ప్రతిపక్ష నాయకులతో రక్షణమంత్రి మాట్లాడారని సమాచారం.