Arvind Kejriwal : కోర్టులో కేజ్రీవాల్‌కి దక్కని ఊరట.. స్వయంగా వాదనలు వినిపించిన సీఎం

ఈడీ విచారణ తర్వాత అసలు మద్యం కుంభకోణం ప్రారంభమైంది. ఆమ్ ఆద్మీ పార్టీని అణిచివేయడమే ED ఉద్దేశం అని కేజ్రీవాల్ వాదనలు వినిపించారు.

Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టులో ఊరట దక్కలేదు. కేజ్రీవాల్ కస్టడీని పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. 4 రోజులు ఈడీ కస్టడీ పొడిగిస్తూ తీర్పు ఇచ్చారు స్పెషల్ కోర్ట్ జడ్జి కావేరి బవేజా. ఏప్రిల్ 1 వరకు కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉండనున్నారు. కేజ్రీవాల్ కస్టడీని వారం రోజుల పాటు పొడిగించాలని ఈడీ కోరగా.. నాలుగు రోజులకు మాత్రమే అంగీకారం తెలిపింది రౌస్ అవెన్యూ కోర్టు. లిక్కర్ కేసులో దర్యాప్తునకు కేజ్రీవాల్ సహకరించడం లేదన్న ఈడీ వాదనను పరిగణనలోకి తీసుకుంది రౌస్ అవెన్యూ కోర్టు. ఈడీ తరపున అడిషనల్ సొలిసిటరీ జనరల్ ఎస్వీ రాజు, జోయబ్ హోస్సేన్ వాదనలు వినిపించారు.

ఈడీ వాదనలు..
ఈడీ విచారణకి కేజ్రీవాల్ సహకరించడం లేదు. లిక్కర్ కేసు దర్యాప్తు కొనసాగుతుంది. సేకరించిన డిజిటల్ డేటాను పరిశీలించాల్సి ఉంది. కేజ్రీవాల్‌ను వ్యక్తిగతంగా విచారించాల్సిన అవసరం ఉంది. కేజ్రీవాల్ వాంగ్మూలాలు రికార్డ్ చేయబడ్డాయి. కేజ్రీవాల్ తప్పించుకునే సమాధానాలు ఇస్తున్నారు. గోవా నుండి పిలిపించబడిన కొంతమంది వ్యక్తులతో కేజ్రీవాల్‌ను కలిపి ప్రశ్నించాల్సి ఉంది. ఉద్దేశపూర్వకంగా విచారణకి సహకరించడం లేదు. ITR వివరాలను కేజ్రీవాల్, కేజ్రీవాల్ న్యాయవాదులు ఇవ్వడం లేదు. పంజాబ్‌లోని సీనియర్ ఎక్సైజ్ అధికారులకు సమన్లు ​​జారీ చేశాం.

కోర్టులో నేరుగా వాదనలు వినిపించిన కేజ్రీవాల్..
రెండేళ్ల క్రితం నుంచి ఈ కేసు నడుస్తోంది. 2022 ఆగస్టులో సీబీఐ కేసు నమోదైంది. అప్పుడు ECIR ఫైల్ చేశారు. నన్ను అరెస్ట్ చేశారు? ఏ కోర్టు నన్ను దోషిగా గుర్తించలేదు. నాపై ఆరోపణలు చేయలేదు.

ఈడీ దాదాపు 25వేల పేజీలను దాఖలు చేసిందని, చాలామంది సాక్షులను విచారించిందని.. ఇదంతా లిఖితపూర్వకంగా ఇవ్వగలరా? రికార్డులోకి తీసుకుంటామని కోర్టు అంది. నన్ను మాట్లాడనివ్వండి అని కేజ్రీవాల్ అన్నారు. సి అరవింద్ స్టేట్ మెంట్ ను ప్రస్తావించారు కేజ్రీవాల్. మనీశ్ సిసోడియా నా ఇంటికి వచ్చారు. నాతో మాట్లాడారు. పత్రాలు ఇచ్చారు. సిట్టింగ్ సీఎంను అరెస్ట్ చేసేందుకు ఈ ప్రకటన సరిపోతుందా? ఈడీ నన్ను ఈ కేసులో ఇరికించాలనుకుంటోంది.

చాలా స్టేట్ మెంట్స్ తర్వాత నాకు వ్యతిరేకంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్టేట్ మెంట్ ఇచ్చారు. శ్రీనివాసులు రెడ్డి స్టేట్ మెంట్ తర్వాత రాఘవ నాకు వ్యతిరేకంగా స్టేట్ మెంట్ ఇచ్చారు. ఆ తర్వాతే రాఘవకు బెయిల్ వచ్చింది. సిట్టింగ్ సీఎంను అరెస్ట్ చేయడానికి 4 ప్రకటనలు సరిపోతాయా? ఈడీ ఫైల్‌లో ఉన్న లక్ష పేజీలు మాకు అనుకూలంగా ఉన్నా రికార్డుల్లోకి తీసుకురాలేదు.

ఈ మద్యం కుంభకోణం డబ్బు చివరకు ఎక్కడికి పోయిందో నేను చెప్పాలనుకుంటున్నాను. రూ.100 కోట్లు అని చెబుతున్నా.. అది ఎక్కడా వాస్తవంగా లేదు. ఈడీ విచారణ తర్వాత అసలు మద్యం కుంభకోణం ప్రారంభమైంది. ఆమ్ ఆద్మీ పార్టీని అణిచివేయడమే ED ఉద్దేశం అని కేజ్రీవాల్ వాదనలు వినిపించారు. కాగా, కేజ్రీవాల్ దర్యాప్తు సంస్థపై ఆరోపణలు చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు ED తరపు న్యాయవాదులు.

”శరత్ రెడ్డి బీజేపీకి 55కోట్లు విరాళం ఇచ్చారు. ఈ దందా సాగుతున్నట్లు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మనీ ట్రయల్ జరిగింది. శరత్ రెడ్డి అరెస్ట్ తర్వాత బీజేపీకి 50 కోట్లు విరాళంగా ఇచ్చారు. నన్ను పోలీసులు ఎన్ని రోజులు రిమాండ్‌లో ఉంచాలనుకుంటున్నారో ఉంచనివ్వండి. నాకు సమ్మతమే” అని కేజ్రీవాల్ అన్నారు.

కేజ్రీవాల్ వాదనలకు కౌంటర్ ఇచ్చారు ఈడీ న్యాయవాది ఎస్వీ రాజు. ” తనకు అనుకూలంగా ఉన్న సంబంధిత పేజీలు ED కస్టడీలో ఉన్నాయని కేజ్రీవాల్ చెప్తున్నారు. ED వద్ద ఉన్నాయని కేజ్రీవాల్ కి ఎలా తెలుసు? అంతా కల్పన. కేజ్రీవాల్ ఆప్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా ఉన్నారు. గోవా ఎన్నికల్లో వినియోగించిన లంచం మొత్తాలను ఆప్ స్వీకరించింది. ఆ డబ్బు సౌత్ గ్రూప్ నుంచి హవాలా నుంచి వచ్చాయని చెప్పడానికి మా దగ్గర సాక్షులు ఉన్నారు. కేజ్రీవాల్ సెలెక్టివ్‌గా మధ్యవర్తుల గురించి మాట్లాడలేదు.

శరత్ రెడ్డి బీజేపీకి డబ్బు ఇచ్చారన్న కేజ్రీవాల్ వ్యాఖ్యలపై స్పందించారు ఎస్వీ రాజు. మద్యం కుంభకోణానికి బీజేపీకి వచ్చిన డబ్బుకు సంబంధం లేదు. మద్యం విధానాన్ని రూపొందించే హక్కు బిజెపికి, మరెవరికీ లేదు. ఎవరైనా ఏ వ్యక్తికి డబ్బు చెల్లించినా మాకు సంబంధం లేదు. మద్యం కుంభకోణానికి డబ్బు చెల్లింపులకు సంబంధం లేదు. సీఎం అయినంత మాత్రాన అరెస్ట్ చెయ్యకూడదని లేదు. సీఎంకు భిన్నమైన ప్రమాణాలు లేవు. సామాన్యుల లాగానే సీఎంను అరెస్ట్ చేసే అధికారం ఉంది. సౌత్ గ్రూప్ నుంచి గోవా ఎన్నికలకు హవాలా ద్వారా 100 కోట్లు ఇచ్చారు. ఒక చైన్ ఉంది దీనిని AAP ఉపయోగిస్తుంది” అని అడిషనల్ సొలిసిటరీ జనరల్ ఎస్వీ రాజు అన్నారు.

రమేశ్ గుప్తా, కేజ్రీవాల్ తరపు న్యాయవాది..
మనీ ట్రయిల్‌ ఏర్పడిందనే కారణంతో కేజ్రీవాల్ రిమాండ్‌ను వ్యతిరేకించడం లేదు. ఎలక్టోరల్ బాండ్స్ తో ఈ కేసుతో సంబంధం లేదా? దీనిపై కూడా విచారణ జరపాలని ఈ కోర్టు ఆదేశించాలి.

 

ట్రెండింగ్ వార్తలు