ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ షాక్..!

బెయిల్ ను వ్యతిరేకించేందుకు మాకు సరైన అవకాశం లభించలేదు, వెకేషన్ మా వాదనలను వినిపించేందుకు సరిపడ సమయం ఇవ్వలేదని ఈడీ తరుపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.

Cm Arvind Kejriwal : ఢిల్లీ హైకోర్టులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. ట్రయల్ కోర్టులో కేజ్రీవాల్ కు మంజూరైన బెయిల్ పైన ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఈడీ స్టే దరఖాస్తు పై నిర్ణయం తీసుకునేంత వరకు.. ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఈడీ దరఖాస్తుపై తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని న్యాయస్థానం తెలిపింది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్ కు ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ ఇంకా తీహార్ జైలులోనే ఉన్నారు. ఆ తీర్పుని సవాల్ చేస్తూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిపింది కోర్టు. తమ వాదనలను పరిగణలోకి తీసుకోకుండా ట్రయల్ కోర్టు కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చిందని, ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ పాత్ర ఉందని, కేజ్రీవాల్ తప్పు చేశారు అనడానికి తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లినా, ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకోలేదని, మేమిచ్చిన పత్రాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా బెయిల్ మంజూరు చేశారని ఈడీ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు.

ఈ కేసులో నేరుగా కేజ్రీవాల్ తప్పు చేశారు అని అనడానికి ఎటువంటి ఆధారాలు లేవని, నిందితులు అప్రూవర్లుగా మారిన వారిచ్చిన స్టేట్ మెంట్స్ ఆధారంగానే మాత్రమే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారని, కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా స్టేట్ మెంట్స్ ఇచ్చిన వారందరికీ బెయిల్ లభించిందని, ఈడీ అభ్యర్థనను కొట్టివేయాలని కేజ్రీవాల్ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు.. ఈ కేసులో తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు కూడా ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కొనసాగుతుందని చెప్పింది. రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేసింది. దీంతో ఆ తీర్పు వచ్చే వరకు కేజ్రీవాల్ తీహార్ జైల్లోనే ఉండనున్నారు.

ఇవాళ అసలేం జరిగిందంటే..
అంతుకుముందే.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఎదురుదెబ్బ తగిలింది. కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలను హైకోర్టు నిలిపివేసింది. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కు ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని ఈడీ హైకోర్టులో సవాల్ చేసింది. దీంతో ఈడీ పిటిషన్ పై విచారణ జరిపే వరకు ట్రయల్ కోర్టు ఉత్తర్వులు అమలు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది.

మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ కు గురువారం రెగులర్ బెయిల్ లభించింది. లక్ష రూపాయల వ్యక్తిగత బాండ్ సమర్పించిన తర్వాత ఆయనను విడుదల చేయవచ్చని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీల్ దాఖలు చేయడానికి వీలుగా దానిని 48గంటల పాటు పక్కన పెట్టాలని ఈడీ చేసిన వినతిని ట్రయల్ కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలోనే నేడు జైలు నుంచి కేజ్రీవాల్ విడుదల కావాల్సి ఉండగా.. ఈడీ హైకోర్టును ఆశ్రయించింది.

ట్రయల్ కోర్టు ఉత్తర్వులు సవాల్ చేస్తూ దర్యాఫ్తు సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. బెయిల్ ను వ్యతిరేకించేందుకు మాకు సరైన అవకాశం లభించలేదు, వెకేషన్ మా వాదనలను వినిపించేందుకు సరిపడ సమయం ఇవ్వలేదని ఈడీ తరుపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించి తమ పిటిషన్ పై అత్యవసర చర్యలు చేపట్టాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు.. విచారణ జరుపుతామని వెల్లడించింది. అప్పటివరకు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను అమలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది.

Also Read : రామాయణంలోని ఘట్టాలను అనుకరిస్తూ స్కిట్.. ఐఐటీ విద్యార్థులకు రూ.1.2 లక్షల చొప్పున ఫైన్

ట్రెండింగ్ వార్తలు