Novavax Covid Vaccine : త్వరలో మరో కోవిడ్ వ్యాక్సిన్..90శాతం సమర్థవంతం

కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు త్వరలో మరో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది.

కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు త్వరలో మరో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది. అమెరికన్ బయోటెక్నాలజీ కంపెనీ “నోవావాక్స్‌”ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. నోవావాక్స్ కోవిడ్ టీకా 90 శాతం స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తున్న‌ట్లు తేలినట్లు ఆ కంపెనీ సోమవారం ప్రకటించింది.క్లినికల్ ట్రయల్స్ లో నోవావాక్స్ కరోనా వైరస్ పై మొత్తంగా 90 శాతం ప్రభావాన్ని చూపుతుందని వెల్లడైందని కంపెనీ ప్రకటించింది. ఈ వ్యాక్సిన్‌.. కరోనా వైరస్‌ మితమైన, తీవ్రమైన కేసుల్లో 100 శాతం రక్షణ ఇస్తుందని నోవావాక్స్‌ పేర్కొంది. ఈ వ్యాక్సిన్ అన్నిరకాల వేరియంట్లపై అంతే ప్రభావాన్ని చూపిస్తుందని వెల్లడించింది.

అమెరికా, మెక్సికో ప్రాంతాలకు చెందిన 18 ఏళ్లు దాటిన సుమారు 30 వేల మందిపై నోవావాక్స్‌ కంపెనీ వ్యాక్సిన్‌ ట్రయిల్స్ నిర్వహించారు. మేరిల్యాండ్‌ ప్రధాన కేంద్రంగా పనిచేస్తోన్న నోవావాక్స్‌ ఈ వ్యాక్సిన్‌కు రెగ్యులేటరీ ఆమోదం కోసం దరఖాస్తు చేయనుంది. రెగ్యులేటరీ నుంచి ఆమోదం రాగానే నెలకు 10 కోట్ల డోసులను ఉత్పత్తి చేయడానికి సిద్థంగా ఉందని నోవావాక్స్‌ కంపెనీ ప్రెసిడెంట్‌, స్టాన్లీ సీ ఎర్క్‌ పేర్కొన్నారు. ప్ర‌పంచ దేశాల్లో వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా డిమాండ్‌ను అందుకోవ‌డంలో నోవావాక్స్ కీల‌క పాత్ర పోషిస్తుందని తెలిపారు. సెప్టెంబ‌ర్ చివ‌రినాటికి అమెరికా, యూరోప్‌, ఇత‌ర దేశాల్లోనూ త‌మ టీకాల‌కు అనుమ‌తి ద‌క్క‌నున్న‌ట్లు నోవావాక్స్ తెలిపింది.

కాగా, నోవావాక్స్‌ తయారుచేసిన వ్యాక్సిన్‌(NVX-CoV2373) ను అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ వ్యాక్సిన్లను 2 డిగ్రీల నుంచి 8 డిగ్రీల వద్ద నిల్వ చేయవచ్చునని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక,భారత్ లో సీరం సంస్థ నోవావాక్స్ వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేయనుంది.

ట్రెండింగ్ వార్తలు