odisha Girl Students Fall Unconscious After Teacher Forces Them To Do 100 Sit Ups
Odisha:అది ఒడిశాలోని బోలంగిర్ జిల్లా పట్నాగఢ్ లోని బాపూజీ హైస్కూల్. స్కూల్ కు లేట్ గా వచ్చినందుకు విద్యార్ధినిలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది టీచర్. లేట్ గా వచ్చినందుకు శిక్ష అనుభవించాల్సిందేనంటూ..హుకుం జారీ చేసింది. విద్యార్థినులతో 100 సార్లు సిట్ అప్ (గుంజిళ్లు) తీయమని ఆదేశించారు. దీంతో విద్యార్ధినులు వన్ టూ త్రీ అంటూ సాధ్యమైనంత వరకు చేశారు. కానీ 100 పూర్తి చేయలేక పాపం విద్యార్ధినులు స్పృహ తప్పి పడిపోయారు.
స్పృహ తప్పిన విద్యార్థినులను అంబులెన్స్ లో పట్నాగఢ్ సబ్ డివిజనల్ ఆసుపత్రికి తరలించారు. బాలికల పరిస్థితి గమనించిన డాక్టర్లు కూడా కంగారుపడ్డారు. ఎందుకంటే వారిని ఆస్పత్రికి తీసుకువచ్చేసరికే కండీషన్ ఏమాత్రం బాగాలేదు. దీంతో డాక్టర్లు వెంటనే ప్రాథమిక చికిత్స చేశారు. కాసేపటికి విద్యార్ధినిలు కాస్తంత కోలుకున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉంది అని మెడికల్ ఆఫీసర్ పితాబాష్ షా తెలిపారు.
స్కూల్ ప్రార్థన సమయం ముగిసిన తర్వాత బాలికలు రావటంతో క్లాస్ టీచర్ బికాష్ దరువా వారికి 100 గుంజిళ్లు తీయించటంతో తాళలేని విద్యార్థినిలు స్పృహ తప్పి పడిపోయారు. ఈ ఘటన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సమీర్ రంజన్ దాస్ దృష్టికి వెళ్లటంతో సదరు టీచర్ పై విచారణకు ఆదేశించారు.