No Chhath Puja : నదుల వద్ద స్నానాలను బ్యాన్ చేసిన ఒడిషా సర్కార్

  • Publish Date - November 17, 2020 / 01:54 AM IST

Bans Chhath Puja : కరోనా మహమ్మారి ఎఫెక్ట్ అన్నిటిపైనా పడుతోంది. వేడుకలు, సంబరాలను ఆంక్షల నడుమ నిర్వహించుకోవాల్సి వస్తోంది. పండుగలను కూడా ఘనంగా జరుపుకోలేని పరిస్థితి నెలకొంది. వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుండడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పలు ఆంక్షలు, నిబంధనలు విధిస్తున్నాయి. ఫలితంగా పండుగలు, పూజలను ఇంట్లోనే నిర్వహించుకోవాల్సి వస్తోంది.



తాజాగా ఛత్ పూజ(No Chhath Puja) పై ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. నదుల వద్ద స్నానాలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. నవంబర్ 20-21 తేదీల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు నదీ తీరాలకు వస్తారని, సామూహిక స్నానాలు చేస్తారని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా కాలంలో ఇలా చేయడం వల్ల ఇంకా వైరస్ విస్తరిస్తుందని వెల్లడిస్తోంది. సామూహిక స్నానాలతో సహా..ఛత్ పూజ వేడుకలపై ఆంక్షలు విధించింది. ఈ మేరకు సోమవారం ఒక ఉత్తర్వు జారీ చేసింది.



ఛత్ పూజను బీహార్, ఉత్తర్ ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటుంటారు. ఉదయాన్నే నదీ తీరాలు, ఘాట్ల వద్దకు వెళ్లి పవిత్ర స్నానాలు చేయడం ఆచారంగా భావిస్తారు. సూర్య దేవుడికి పూజలు చేస్తుంటారు. పవిత్ర స్నానాలు, పూజలు చేయడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు నదీ ఒడ్డున చేరుకుంటారని, వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని, నిబంధనలు, ప్రోటోకాల్ లను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని Special Relief Commissioner (SRC) కార్యాలయం వెల్లడించింది.



ప్రజలు ఇళ్లలోనే ఉండి పూజలు నిర్వహించుకోవాలని సూచించారు. భౌతిక దూరం, మాస్క్ ధరించడం, చేతులు పరిశుభ్రంగా కడుక్కోవడం లాంటివి చేయాలని వెల్లడించారు. ఉత్వర్వులను ఉల్లంఘించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం కఠిన చర్యలు తీసుకొంటామని SRC హెచ్చరించింది.



ఛత్ పూజకు సంబంధించి ఒడిశా ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసిందని నంద్ లాల్ సింగ్ (బీజేడీ అధ్యక్షుడు) వెల్లడించారు. ఈ క్లిష్టకాలంలో ఇళ్ల వద్దే ఉంటూ..బాధ్యతాయుతంగా ఉండాలని కోరుతున్నట్లు వెల్లడించారు. ఒడిశా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు సూచించారు.

ట్రెండింగ్ వార్తలు