మరో పథకం కాపీ : ఒడిశాలోనూ కంటివెలుగు

  • Publish Date - January 18, 2019 / 03:03 AM IST

భువనేశ్వర్ : దేశానికి ఆదర్శంగా తెలంగాణ పథకాలు నిలుస్తున్నాయి. ఇతర రాష్ట్రాలు ఇక్కడి అమలవుతున్న పథకాలను కాపీ కొడుతున్నాయి. పేర్లు మార్చి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. తెలంగాణ దళపతి కేసీఆర్ ఆలోచన నుండి పుట్టుకొచ్చిన రైతు బంధు, రైతు పెట్టబడి..ఇతరత్రా పథకాలపై పలు రాష్ట్రాలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి. పథకాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో విజయంతంగా కొనసాగుతున్న ‘కంటివెలుగు’పై ఒడిశా సర్కార్ కన్ను పడింది. ‘సునేత్ర’ పేరిట పథకం అమలు చేస్తోంది. రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు, అద్దాల పంపిణీ, శస్త్ర చికిత్సలు చేయనన్నారు. అచ్చంగా ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రైతు బంధు, రైతు బీమా స్పూర్తితో ఒడిశా సర్కార్ కృషక్ అసిస్టెన్స్ ఫర్ లైవ్లీ హుడ్ అండ్ ఇన్ కమ్ అగుమెంటేషన్ పేరిట పథకాన్ని ప్రారంభించింది. ఐదేళ్లకు రూ. 680 కోట్లను కేటాయించింది. 58,125 కళ్లద్దాలను ఇప్పటికే పంపిణీ చేసింది. 
తెలంగాణలో పలు పథకాలు…
తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్యవంత రాష్ట్రంగా మార్చేందుకు కేసీఆర్ నడుం బిగించారు. అధికారంలో ఉన్న సమయంలో కంటి వెలుగు పథకం ప్రవేశపెట్టారు. కేసీఆర్ కిట్…మాతాశిశువుల సంరక్షణ కోసం ప్రసవించిన ప్రతి మహిళకు 16 రకాల వస్తువులతో ‘కేసీఆర్‌ కిట్‌’ ఇస్తున్నారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవానికి చేరిన మాతృమూర్తికి 12వేలు ఇవ్వాలని, ఆడపిల్ల పుడితే వెయ్యిరూపాయలు  ఇస్తున్నారు. ఆరోగ్య శ్రీని పటిష్టం చేసి 85.04 లక్షల కుటుంబాలకు ఆరోగ్య బీమా వర్తింప చేస్తున్నారు. అవసరాన్ని బట్టి రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షల వరకు వైద్య సేవలను అందిస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుండి రూ. 12 లక్షల వరకు సాయం అందిస్తున్నారు. ఈ పథకం స్పూర్తిగా తీసుకుని కేంద్ర సర్కార్ ఆయుష్మాన్ భవత్ పథకానికి శ్రీకారం చుట్టింది.