Squint Eye : ఆన్‌లైన్ క్లాసులతో పిల్లలకు కొత్త ముప్పు

ఆన్ లైన్ క్లాసులతో పిల్లలకు ముప్పు పొంచి ఉందా? కంటి సమస్యలు వస్తాయా? మెల్లకన్ను సమస్య తీవ్రమవుతోందా? అంటే అవుననే

Squint Eye

Squint Eye : ఆన్ లైన్ క్లాసులతో పిల్లలకు ముప్పు పొంచి ఉందా? కంటి సమస్యలు వస్తాయా? మెల్లకన్ను సమస్య తీవ్రమవుతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. కరోనా కారణంగా స్కూళ్లు మూతపడ్డాయి. దీంతో గత ఏడాదిన్నరగా ఆన్​లైన్​లోనే విద్యార్థులు పాఠాలు వింటున్నారు. అయితే ఇలా డిజిటల్​(మొబైల్, ల్యాప్ టాప్, ట్యాబ్స్) క్లాసులు వింటున్న పిల్లల్లో కంటి సమస్యలు తలెత్తుతున్నాయట. గంటల తరబడి గ్యాడ్జెట్స్ వైపు చూడటంతో పిల్లల్లో దృష్టి లోపంతో పాటు మెల్లకన్ను సమస్య ఏర్పడే ఆస్కారం ఎక్కువగా ఉన్నట్టు డాక్టర్లు నిర్ధారించారు.

తాజా అధ్యయనం ప్రకారం.. రోజులో సగటున 5గంటలు ఆన్ లైన్ క్లాసులు, ఇతర యాక్టివిటీస్ కోసం మరో 3గంటలు.. మొత్తంగా 8 గంటలు డిజిటల్ స్క్రీన్ లపై క్లాసులు వింటున్నారని తేలింది. రోజువారీగా ఇదే ప్రక్రియ కొనసాగుతుండటం వలన పిల్లల్లో కంటి పొర దెబ్బతినడంతో పాటు దృష్టిలోపం, మెల్లకన్ను వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్స్ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు.

స్క్రీన్​ చూసే సమయం పెరుగుతున్న కారణంగా దేశంలోని స్కూల్ పిల్లల్లో మయోపియా అంటే దగ్గరి చూపు అధికమవుతోందట. ఇది పిల్లల్లో రోజురోజుకీ విస్తరిస్తోందట. దేశవ్యాప్తంగా ఉన్న పిల్లల చికిత్స విభాగాల గణాంకాల ప్రకారం విద్యార్థుల్లో మెల్ల కన్ను(Esotropia) సమస్య కూడా తీవ్రమవుతోందని ఓ అధ్యయనంలో తేలింది. ఈ కేసులు 2020 నుంచి భయం గొల్పే రీతిలో పెరుగుతున్నాయని తెలంగాణలోని డాక్టర్‌ అగర్వాల్స్ ఐ హాస్పిటల్స్‌ తన నివేదికలో తెలిపింది.

లాక్‌డౌన్‌ కారణంగా చదువులు లేదా ఇతర అవసరాల కోసం కంప్యూటర్లు, ల్యాప్‌టాప్స్‌, మొబైల్‌ ఫోన్లు లేదా ట్యాబ్లెట్లతో దగ్గర నుంచి పని చేయాల్సిన అవసరం ఏర్పడింది. అంతేకాదు మధ్యలో విరామం తీసుకోకుండా కూడా పని చేయాల్సి ఉంటుంది. కంటి మీద పడే ఈ ఒత్తిడి మెల్లకన్నుకు దారితీయవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు దగ్గరి చూపు ప్రభావాన్ని పెంచుతుంది.

తల్లిదండ్రులు ఆన్‌లైన్‌ క్లాసుల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచించారు. తరగతుల అనంతరం కూడా విద్యార్థులు మొబైల్స్, గ్యాడ్జెట్స్‌కు దూరంగా ఉంచాలని చెప్పారు. ఆన్‌లైన్‌ క్లాసులు తప్పనిసరి అయినప్పుడు మొబైల్‌ ఫోన్ల స్థానంలో పిల్లలు ల్యాప్‌టాప్స్‌/డెస్క్‌టాప్స్‌ ఉపయోగించేలా తల్లిదండ్రులు చూడాలన్నారు. మొబైల్‌ ఫోన్ స్క్రీన్లతో పోల్చితే కంప్యూటర్లు, కంటికి మధ్య దూరం ఎక్కువ ఉంటుందని వివరించారు. అంతే కాదు కుదిరితే పిల్లలు బయట ఆడుకునేలా చూడాలని, రోజుకు గంట నుంచి 2 గంటల పాటు సూర్యరశ్మి అందడం ముఖ్యమని అన్నారు. సమగ్ర ఎదుగుదల కోసం ఆరోగ్యకరమైన, చక్కని సమతుల ఆహారం అవసరమని తెలిపారు. పోషక విలువలు అధికంగా ఉండే ఆహారాన్ని పిల్లలకు అందించాలన్నారు. దీని వలన దృష్టి లోపాన్ని కొంతమేర అయినా అరికట్టవచ్చని తెలిపారు.