Online food : కేకులు..బిస్కెట్లు..బన్నులు..బర్గర్లు..స్వీట్లు వంటి పలు ఆహార పదార్ధాలు వంటివి ఇష్టమొచ్చినట్లు అమ్మితే ఇకపై జేబులే కాదు బ్యాంక్ బ్యాలెన్స్ లు కూడా ఖాళీ అయిపోయేంత జరిమానాలు వేస్తామంటూ ఆహార భద్రతా విభాగం హెచ్చరిస్తోంది. ముఖ్యంగా ఈ కరోనా సమయంలో కేకులు వంటివి ఆన్ లైన్ లో అమ్మకాలు ఎక్కువయ్యాయి. కానీ రిజిస్ట్రేషన్లు లేకుండా అమ్మే ఇటువంటి అమ్మకాలు చేస్తే రూ.5లక్షలు జరిమానా విధిస్తామని ఆహార భద్రతా విభాగం హెచ్చరించింది.
Online అమ్మకాల్లో జాగ్రత్త చాలా అవసరం
ఈ కరోనా సమయంలో బయట తినడం కంటే ఇంట్లో చేసిన ఆహారాన్ని తినటం ఆరోగ్యానికి మంచిది. కోవిడ్-19 సమయంలో అనేక మంది ఇళ్లల్లో కేక్, ఆహార పదార్థాలు తయారు చేసి అమ్మకాలు చేస్తున్నారు. ఆన్ లైన్ ద్వారా ఈ అమ్మకాలు జరుగుతున్నాయి. ఇటువంటి విక్రయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
లైసెన్స్ లేకుండా ఆహార పదార్ధాలను విక్రయిస్తే రూ.5 లక్షల జరిమానా జైలు కూడా
లైసెన్స్ లేకుండా ఆహార పదార్ధాలను విక్రయిస్తే రూ.5 లక్షల వరకు జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష పడే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. భారత ఆహార భద్రతా, ప్రామాణిక అథారిటి ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ఆహార భద్రతా విభాగం ఫుడ్ ఐటెమ్స్ విక్రయించేందుకు లైసెన్సు జారీచేస్తుంది. 2011 ఆగస్టు 5 నుంచి ఇది అమలులో ఉంది.
కరోనాకు ముందు కరోనా తరువాత
అయితే ఈ కోవిడ్-19 సంక్షోభానికి ముందు వరకు ఈ చట్టం దాదాపు అమలు జరిగిందనే చెప్పుకోవచ్చు. కానీ కరోనా తరువాత ఉద్యోగాలు..ఉపాధి కోల్పోయిన చాలా మంది ఈ నియమాలను పట్టించుకోకుండా ఎవరి ఇష్టమొచ్చినట్లుగా వారు ఆహారాలు తయారు చేసి ఆన్ లైన్ లో అమ్మేస్తున్నారు. మార్చి నుంచి ఇటువంటి గృహ ఆధారిత వ్యాపారాల కోసం 2300 రిజిస్ట్రేషన్లు నమోదు అయ్యాయి.
లైసెన్స్ తప్పనిసరి
చాలా వరకూ లైసెన్స్, రిజిస్ట్రేషన్ లేకుండానే విక్రయాలు చేస్తున్నాయని తెలిసింది. అలాంటి వ్యాపారులు లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. పర్యవేక్షణాధికారుల వచ్చినప్పుడు లైసెన్సుకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవాలి. రూ. 12 లక్షల కంటే ఎక్కువ అమ్మకాలు ఉన్న యూనిట్లకు లైసెన్స్ తప్పనిసరి.
రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే..
ఈ మొత్తం కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికి రిజిస్ట్రేషన్ అవసరం. అక్షయ కేంద్రాల ద్వారా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఫొటో ఐడీ, ఫొటో అప్ లోడ్ చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు.
నాణ్యత తప్పనిసరి
తయారీదారులే నీరు, ఆహారపదార్థాల తయారీకి వాడే సరుకుల నాణ్యతకు బాధ్యత వహించాలి. ఏమైనా ఫిర్యాదులు వస్తే సంబంధిత ప్రాంతంలోని ఆహార భద్రతా అధికారులు తనిఖీ చేస్తారు. దీంతోపాటు జరిమానా విధించవచ్చు. కాబట్టి అన్ని విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. లేదంటే ఇబ్బందులు తప్పవంటున్నారు అధికారులు.
నేరాన్ని బట్టి శిక్ష
లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ లేకుండా పనిచేస్తే..ఆయా నేరాలను బట్టి రూ.5 లక్షల వరకు జరిమానాతో పాటు ఆరు నెలల వరకు జైలు శిక్ష విధిస్తారు. కల్తీ ఆహారాన్ని అమ్మినన్నట్లుగా తేలితే..జరిగిన నేరం స్వభావాన్ని బట్టి జైలు శిక్ష తో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. లేబుల్ లేకుండా వస్తువులను అమ్మినందుకు రూ.3 లక్షల జరిమానా విధిస్తారు. నాణ్యత లేని వస్తువులను అమ్మినందుకు రూ.5 లక్షల జరిమానా ఉంటుంది.