Ukraine Sumy : క్లైమాక్స్‌‌కు చేరుకున్న ఆపరేషన్ గంగ.. సుమిలో 700 మంది ఇండియన్స్

రష్యా బాంబుల వర్షం కురిపిస్తుండడంతో సుమి నుంచి విద్యార్థుల్ని తీసుకురావడానికి సురక్షిత మార్గాలేవీ అందుబాటులో లేవు. దీంతో దాడులు ఆగిన తర్వాతే విద్యార్థుల తరలింపు...

War

Operation Ganga : భారతీయుల తరలింపు కత్తిమీద సాములాగా మారిపోయింది. ఎందుకంటే సుమిలో ప్రతిక్షణం మిస్సైల్స్‌ వర్షమే కురుస్తోంది. బాంబుల భయాంకర శబ్దాలే వినిపిస్తున్నాయి. అందుకే ఆపరేషన్‌ గంగ ఇప్పటి వరకు సుమిలో కాలు మోపలేకపోయింది. భీకరంగా పోరాడుతుండడంతో అక్కడ చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ ఇప్పటివరకు ప్రారంభంకాలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. యుక్రెయిన్‌లో రెండో అతిపెద్ద నగరం ఖార్కివ్‌ నుంచి కూడా భారతీయులను క్షేమంగా తీసుకురాగలిగిన ఇండియాకు సుమి కఠిన సవాల్ విసురుతోంది. సుమిలో దాదాపు 700మంది భారతీయ విద్యార్థులు చిక్కుకుని ఉన్నారు. ఇప్పుడు వారందరిని స్వదేశానికి తీసుకొస్తే ఆపరేషన్‌ గంగ గ్రాండ్‌ సక్సెస్‌ కిందే లెక్క అవుతుందని భావిస్తున్నారు.

Read More : PM Modi: భారత్ శక్తివంతంగా తయారవుతుంది కాబట్టే “ఆపరేషన్ గంగా” సాధ్యమైంది: మోదీ

ఇప్పటివరకు అంతా హ్యాపిగానే కొనసాగిన ఆపరేషన్‌ గంగ ఫైనల్‌ స్టేజ్‌కు చేరుకుంది..! రియుపోల్, వోల్నోవాఖా నగరాల్లో పౌరులను ఖాళీ చేయించడానికి మానవతా దృక్పథంతో సివిల్ కారిడార్‌ను ఏర్పాటు చేసింది రష్యా. అయితే సుమిలో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించలేదు. సుమిలో చిక్కుకున్న విద్యార్థుల్ని సరిహద్దులకు చేర్చాలంటే మారియుపోల్, వోల్నోవాఖ నుంచి తీసుకురావడం కూడా ఒక మార్గం. కానీ, అక్కడ రష్యా బాంబుల వర్షం కురిపిస్తుండడంతో సుమి నుంచి విద్యార్థుల్ని తీసుకురావడానికి సురక్షిత మార్గాలేవీ అందుబాటులో లేవు. దీంతో దాడులు ఆగిన తర్వాతే విద్యార్థుల తరలింపు సాధ్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.

Read More : Russia – Ukraine War: చివరి దశకు ఆపరేషన్ గంగ.. హంగేరీలోని భారత ఎంబసీ కీలక ప్రకటన

మరోవైపు సుమి నుంచి విద్యార్థుల తరలింపుపై కేంద్రం ఎప్పటికప్పుడు ప్రణాళికలు రచిస్తోంది. సుమిలో చిక్కుకున్న విద్యార్థులకు భారత రాయబార కార్యాలయం తాజా ఆదేశాలు జారీ చేసింది. సుమి విద్యార్థులు స్వదేశానికి బయలుదేరడానికి సిద్ధంగా ఉండాలని సూచించింది. సుమిలో చిక్కుకుపోయిన విద్యార్థులను సురక్షితంగా తరలించడానికి పోల్టావా సిటీలో ఒక బృందం ఉందని ఇండియన్‌ ఎంబసి క్లారిటీ ఇచ్చింది. తరలింపు సమయం, తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని.. అంతవరకు ధైర్యంగా ఉండాలంటూ సూచించింది.