దేశ రాజధాని ఢిల్లీకి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గెలుపు కోసం పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్
దేశ రాజధాని ఢిల్లీకి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గెలుపు కోసం పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో మరోసారి ఘన విజయం సాధించాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. 2015లో 70 సీట్లకు గానూ 67 స్థానాల్లో గెలుపొందామని గుర్తు చేసిన కేజ్రీవాల్.. ఈ సారి ఆ సంఖ్య తగ్గకూడదన్నారు. శనివారం(డిసెంబర్ 21,2019) నిర్వహించిన పార్టీ జాతీయ మండలి సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడారు.
ఎన్నికలకు కేవలం నెల రోజుల వ్యవధి మాత్రమే ఉందని కేజ్రీవాల్ అన్నారు. ఈసారి మన లక్ష్యం చాలా పెద్దదని చెప్పారు. గత సారి 67 స్థానాల్లో గెలుపొందాము.. ఈ సారి అంతకంటే ఎక్కువే రావాలి తప్ప తక్కువ రాకూడదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. దీంతో సభ్యులు 70కి 70 అంటూ నినాదాలు చేశారు. అభివృద్ధి నినాదంతోనే ముందుకు వెళ్లాలని కేజ్రీవాల్ సూచించారు. సీఏఏ గురించి ప్రస్తావిస్తూ.. హిందూ-ముస్లిం ఢిల్లీలో పనిచేయదని బీజేపీకి కౌంటర్ ఇచ్చారు. గత ఐదేళ్లలో మనం ఏం చేశామో అదే చెప్పాలన్నారు కేజ్రీవాల్.
2020 జనవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆప్ సిద్ధమైంది. ఈసారి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకోనుంది ఆప్. ఈ మేరకు పీకేతో ఒప్పందం కూడా చేసుకున్న సంగతి తెలిసిందే.