పూరీ జగన్నాథ రథయాత్ర.. 500 మందికిపైగా భక్తులకు గాయాలు?

ఆలయం సమీపంలో ప్రాథమిక వైద్య కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి ముకేశ్ మహాలింగ్ తెలిపారు.

ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా అక్కడకు ఇసుకవేస్తే రాలనంత జనం వచ్చారు. రథాన్నిలాగే క్రమంలో 500 మందికిపైగా భక్తులు గాయపడ్డారని కళింగ టీవీ తెలిపింది. ఈ ఘటన తాళధ్వజ రథాన్ని లాగే వేళ చోటుచేసుకున్నట్లు చెప్పింది.

జగన్నాథ రథయాత్ర వేళ కొంత మంది భక్తులు స్పృహతప్పి పడిపోయారు. ఈ ఘటనపై ఒడిశా మంత్రి ముకేశ్ మహాలింగ్ స్పందిస్తూ.. అధిక తేమ కారణంగా ఇలాంటి ఘటనలు జరిగాయని చెప్పారు. వాతావరణ పరిస్థితుల వల్ల కొందరు భక్తులు పడిపోయారని, సహాయక బృందాలు వెంటనే స్పందించి వారిని ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు వివరించారు.

ఆలయం సమీపంలో ప్రాథమిక వైద్య కేంద్రాలు ఏర్పాటు చేశామని, నీరు, గ్లూకోజ్ ఏర్పాటు చేశామని ముకేశ్ మహాలింగ్ తెలిపారు. తాను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నానని, ఆసుపత్రికి కూడా వెళ్లి వారిని పరామర్శిస్తానని అన్నారు.

జగన్నాథుడు, ఆయన సోదరుడు బలభద్ర, సోదరి సుభద్ర.. జగన్నాథ ఆలయం నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలోని గుండిచాదేవి ఆలయం వరకు వెళ్లే ప్రస్థానమే ఈ రథయాత్ర. పూరీ నగరానికి జనాలు భారీగా తరలివచ్చిన నేపథ్యంలో భద్రత కోసం 10,000 మంది సిబ్బందిని నియమించారు. ఇందులో ఎనిమిది కంపెనీల సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ ఉన్నాయి.

కాగా, రథయాత్రలో పెంచిన తల్లి గుండిచాదేవి ఆలయానికి వెళ్లిన జగన్నాథుడు అక్కడ తొమ్మిది రోజులు ఉండి, వచ్చేనెల 5న బహుడాగా శ్రీక్షేత్రానికి వస్తాడు.