రైళ్లలో ఇబ్బంది పెట్టిన 70వేల మంది హిజ్రాలు అరెస్ట్

  • Publish Date - April 25, 2019 / 04:15 PM IST

రైలులో జనరల్ బోగీలో వెళ్తుంటే హిజ్రాల తాకిడి ఎలా ఉంటదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బెదిరించి డబ్బులు నొక్కేసేందుకు విపరీతంగా ట్రై చేస్తుంటారు. హిజ్రాల బెదిరింపులపై దేశవ్యాప్తంగా రైల్వేశాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తుతుంటాయి. అయితే చర్యలు మాత్రం తక్కువ అని విమర్శలు వస్తుంటాయి.

సోషల్ మీడియా వేదికగా అనేకమంది ఫిర్యాదులపై ఏం చేశారు అని రైల్వే శాఖను ప్రశ్నిస్తుంటారు. తాజాగా ఇదే విషయమై ఓ వ్యక్తి ఆర్టీఐ చట్టం ద్వారా ఎంతమందిని ఇప్పటివరకు అరెస్ట్ చేశారంటూ ప్రశ్నించగా.. 74వేల మంది హిజ్రాలను అరెస్ట్ చేసినట్టు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

గత నాలుగేళ్ల కాలంలో మొత్తం 73,837 మందిని అంటే సగటున రోజుకు 50 మంది హిజ్రాలను ప్రయాణికులను ఇబ్బంది పెడుతూ డబ్బులు వసూలు చేస్తున్నందుకు అరెస్ట్ చేసినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2015 నుంచి 2019 జనవరి వరకు సేకరించిన డేటాను రైల్వే అధికారులు ఆర్టీఐ దరఖాస్తుదారుడికి వివరించారు.

ఆ లెక్కల ప్రకారం 2015లో 13,546 మందిని, 2016లో 19,800 మందిని, 2017లో 18,526 మందిని, 2018లో 20,566 మందిని అరెస్ట్ చేయగా.. 2019 జనవరిలో 1399 మందిని అరెస్ట్ చేశారు.

రైళ్లలో హిజ్రాలు డబ్బులు కోసం ఇబ్బందులు పెట్టడం.. డబ్బులు ఇవ్వకపోతే దాడులు చేయడం, అసభ్యంగా ప్రవర్తించడం వంటి పనులు చేస్తుండడం చూస్తూనే ఉంటాం.