పాక్‌ గగనతలంపై భారత్ విమానాల రాకపోకలపై నిషేధం.. మనపై పడే ప్రభావం ఎంత?

పాకిస్థాన్‌ తమ గగనతలం మూసివేయడంతో ఈ ప్రభావం అంతర్జాతీయ విమాన సర్వీసులపై పడిందని ఇప్పటికే ఎయిర్‌ ఇండియాతో పాటు ఇండిగో ప్రకటనలు చేశాయి.

పాక్‌ గగనతలంపై భారత్ విమానాల రాకపోకలపై నిషేధం.. మనపై పడే ప్రభావం ఎంత?

Updated On : April 25, 2025 / 8:02 PM IST

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై భారత్‌ దౌత్యపరమైన చర్యలు తీసుకుంటుండడంతో పాక్‌ కూడా పలు నిర్ణయాలు తీసుకుంటోంది. పాక్ గగనతలంపై భారత విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. తమ దేశం విషయంలో ఇండియా అమల్లోకి తీసుకొచ్చిన అన్ని ఆంక్షలనూ తమ దేశం కూడా విధిస్తోందని ప్రకటన చేసింది. సిమ్లా ఒప్పందాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు ఇప్పటికే తెలిపింది.

8 – 12 శాతం విమాన ఛార్జీలు పెరిగే ఛాన్స్
పాక్ గగనతలంపై భారత విమానాల రాకపోకలపై నిషేధం విధించిన నేపథ్యంలో మన దేశ ప్రయాణికులపై భారం పడనుంది. ప్రధానంగా ఢిల్లీ సహా ఇతర ఉత్తరాది ప్రాంతాల నగరాల నుంచి బయలుదేరే విమానాలు గమ్యస్థానాలకు చేరుకునే సమయం బాగా పెరగనుంది.

సమీప భవిష్యత్తులో 8 – 12 శాతం మధ్య విమాన ఛార్జీలు పెరగొచ్చు. పాకిస్థాన్‌ తమ గగనతలం మూసివేయడంతో ఈ ప్రభావం అంతర్జాతీయ విమాన సర్వీసులపై పడిందని ఇప్పటికే ఎయిర్‌ ఇండియాతో పాటు ఇండిగో ప్రకటనలు చేశాయి. అలాగే, స్పైస్‌జెట్‌, ఎయిర్‌ ఇండియా కూడా అంతర్జాతీయ సర్వీసులను నిర్వహింటాయి.

మన విమానాలు వెళ్లకుండా పాకిస్థాన్‌ గగనతలం మూసివేయడంతో ఆయా విమానాలు గమ్యస్థానాలు చేరుకునే మార్గాలు, వ్యవధి, టికెట్ల ధరలు పెరిగిపోతాయని ఎయిర్‌లైన్ అధికారి ఒకరు అన్నారు.

“పాకిస్థాన్ గగనతలం మూసివేత కారణంగా యూరప్, యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లే విమాన మార్గాలు, వ్యవధి పెరుగుతుంది. మేము ప్రస్తుతం ప్రత్యామ్నాయ మార్గాల కోసం చూస్తున్నాము. ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల నుంచి యూరప్‌, ఉత్తర అమెరికాకు అవుట్ గోయింగ్ విమానాలపై ప్రభావం పడుతుంది. అలాగే, మధ్యప్రాచ్యానికి వెళ్లే విమానాలపై ప్రభావం ఉంటుంది. ఆపరేటింగ్ కాస్ట్‌ పెరుగుతుండడంతో విమానా టికెట్ల ధరలు కూడా పెరుగుతాయి” అని చెప్పారు.

కాగా, 2019 బాలాకోట్‌లో దాడుల వేళ పాకిస్థాన్‌ గగనతలం మూసివేత సమయంలో విమానయాన సంస్థలకు దాదాపు రూ.700 కోట్ల నష్టం వచ్చింది. ప్రయాణికులు ఛార్జీలపై ఛార్జీల భారం 8 శాతం నుంచి 40 మధ్య పడింది.

పహల్గాంలో పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు పాల్పడ్డ దాడిని పలువురు ప్రముఖులు ఖండిస్తున్నారు. తాజాగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. సమాజాన్ని విభజించడంతో పాటు సోదరుల మధ్య వివక్షను పెంచడం ఉగ్రవాదుల లక్ష్యమని చెప్పారు. ఈ ఉగ్ర చర్యను జమ్మూకశ్మీర్‌ మొత్తం ఖండించిందని అన్నారు. భారతీయులందరూ ఐక్యంగా ఉండటం చాలా ముఖ్యమైన విషయమని, అప్పుడే ఉగ్ర చర్యలను, వారి ప్రయత్నాలను సమర్థవంతంగా ఎదుర్కుంటామని ఆయన అన్నారు.