Operation Sindoor Updates: ఆపరేషన్ సిందూర్, అనంతర పరిణామాలపై భారత విదేశాంగ, రక్షణశాఖలు సంయుక్త ప్రెస్ మీట్ నిర్వహించాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్తలపై ప్రత్యేక బ్రీఫింగ్ ఇచ్చారు. ఇవాళ్టి వైమానిక దాడులపై వివరణ ఇచ్చారు అధికారులు. భారత్ పై పాకిస్తాన్ దాడులకు యత్నించిందని కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. భారత్ లోని 15 ప్రాంతాల్లో పాక్ దాడులకు ప్రయత్నించిందన్నారు. పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామని, పాక్ మిస్సైళ్లను కూల్చేశాని వెల్లడించారు. లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను నిర్వీర్యం చేశామన్నారు.
”ఈ ఉదయం, భారత సాయుధ దళాలు పాకిస్తాన్‌లోని అనేక ప్రదేశాలలో వైమానిక రక్షణ రాడార్లు, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నాయి. భారత ప్రతిస్పందన పాకిస్తాన్ మాదిరిగానే తీవ్రతతో ఉంది. లాహోర్‌లోని వైమానిక రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశాం. పాక్ లోని ఏ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకోలేదు. ఇప్పటివరకు పాకిస్తాన్‌లో పౌరుల మరణాలకు సంబంధించి నివేదికలు లేవు” అని కల్నల్ సోఫియా ఖురేషి వివరించారు.
సరిహద్దుల్లో పాకిస్తాన్ కాల్పులకు తెగబడిందని, ఈ కాల్పుల్లో 16 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారని చెప్పారు. నిన్నటి నుంచి కుప్వారా, బారాముల్లా, ఉరి, పూంచ్, మెందార్, రాజౌరి సెక్టార్లలో పాక్ కాల్పులకు తెగబడుతోందన్నారు. పాక్ కాల్పులకు భారత సైన్యం ధీటుగా బదులిస్తోందని వ్యోమికా సింగ్ అన్నారు.
పాక్ లోని మిలటరీ స్థావరాలను మేము టార్గెట్ చేయలేదని, కేవలం టెర్రరిస్ట్ స్థావరాలపైనే దాడి చేశామని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు. టెర్రరిస్టులకు పాక్ అడ్డాగా మారిందని, సీమాంతర తీవ్రవాదాన్ని పాక్ పెంచి పోషిస్తోందని ఆయన అన్నారు. అంతర్జాతీయ సమాజానికి పాక్ తప్పుడు సమాచారం ఇస్తోందని ఆరోపించారు.
”పహల్గాం దాడి చేసింది తామేనని టీఆర్ఎఫ్ ప్రకటించింది. ఉగ్రదాడితో మాకు సంబంధం లేదని పాక్ చెబుతోంది. టీఆర్ఎఫ్ ను ఉగ్రవాద సంస్థగా పాక్ ఎందుకు ప్రకటించడం లేదు? పహల్గాం ఉగ్రదాడితో పాక్ కు సంబంధం ఉంది. అన్ని ఆధారాలను ఇప్పటికే ఐక్యరాజ్యసమితికి అందించాం” అని విక్రమ్ మిస్రీ తెలిపారు.