పాక్ సాధారణంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి

త‌మ భూభాగంపై ఉన్న ఉగ్ర గ్రూపుల‌ను పాక్ అదుపు చేయాల‌ని భార‌త్ హెచ్చ‌రించింది. పాకిస్తాన్ సాధార‌ణ పొరుగుదేశంగా ప్ర‌వ‌ర్తించ‌డం నేర్చుకోవాల‌ని, ఉగ్ర‌వాదుల‌ను ఉసిగొల్ప‌డం కాద‌ని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ అన్నారు. ఉగ్ర‌వాదాన్ని పాక్ ప్రోత్స‌హిస్తున్న‌ట్లు తాము భావిస్తున్నామ‌ని, దాన్ని ఒక పాలసీగా పాక్ అమ‌లు చేస్తోంద‌ని ఆరోపించారు. ఉగ్ర‌వాదుల ప‌ట్ల త‌మ‌కు ఉన్న ఆందోళ‌న‌ల‌ను పాక్‌కు చెప్పిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఉగ్ర‌వాదుల‌ను భార‌త్‌లోకి పాక్ ఉసి గొల్పుతోంద‌న్న స‌మాచారం అందింద‌న్నారు. 

జ‌మ్మూక‌శ్మీర్ అంశంపై పాక్ త‌ప్పుడు ప్ర‌చారాలు చేస్తోంద‌ని రవీష్ కుమార్ అన్నారు. పాక్ మాన‌వ హ‌క్కుల మంత్రి షిరీన్ మ‌జారీ చేసిన వ్యాఖ్య‌ల‌ను రవీష్ ఖండించారు. పాక్ బాధ్య‌తార‌హిత‌మైన వ్యాఖ్య‌లు చేస్తోంద‌న్నారు.  జ‌మ్మూక‌శ్మీర్ అంశంపై రాహుల్ గాంధీ, హ‌ర్యానా సీఎం ఎంఎల్ ఖ‌టార్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఐక్యరాజ్యసమితిలో వేసిన పిటిషన్ లో పాక్ ప్రస్తావించడాన్ని రవీష్ తీవ్రంగా ఖండించారు. పాక్ సాధార‌ణంగా ప్ర‌వ‌ర్తించ‌డం నేర్చుకోవాల‌ని, ఉగ్ర‌వాదుల‌ను ఉసిగొల్ప‌డం కాద‌న్నారు.

పాక్ గ‌గ‌న‌త‌లం మూసివేత‌కు సంబంధించిన ఇప్ప‌టివ‌ర‌కు ఎటువంటి స‌మాచారం లేద‌న్నారు. కుల్‌భూష‌ణ్ జాద‌వ్ కేసులో పాక్ ప్ర‌భుత్వంతో ట‌చ్‌లో ఉన్న‌ట్లు  చెప్పారు. క‌శ్మీర్ హాస్పిటల్స్ లో మందుల కొర‌త‌లేద‌న్నారు. ఒక్క‌రూ ప్రాణం కోల్పోలేదు, ఒక బుల్లెట్ కూడా పేల‌లేద‌ని, క‌శ్మీర్‌లో ప‌రిస్థితి క్ర‌మంగా మెరుగుప‌డుతోంద‌న్నారు