భారతీయ ఫార్మా ఇండస్ట్రీ ప్రపంచానికే ఒక ఆస్తి

భారత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ సానుకూలంగా సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. ప్రపంచ దేశాల్లోని దిగ్గజ సంస్థలు భారత్​లో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని మోడీ ఆహ్వానించారు. బ్రిటన్​లో నిర్వహిస్తున్న ‘ఇండియా గ్లోబల్​ వీక్​-2020’లో దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న మోడీ… భారత ఆర్థిక వ్యవస్థలో ఇప్పటికే సానుకూల స్పందనలు చూస్తున్నట్టు స్పష్టం చేశారు.

అన్ని గ్లోబల్ కంపెనీలు వచ్చి భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి తాము రెడ్ కార్పెట్ వేస్తున్నాము అని మోడీ అన్నారు. ఇలాంటి అవకాశాలు చాలా తక్కువ దేశాలు కల్పిస్తాయని ప్రధాని అన్నారు. భారత్​లోని వివిధ రంగాల్లో పెట్టుబడులకు మెరుగైన అవకాశాలున్నాయని మోడీ పేర్కొన్నారు.

వ్యవసాయ రంగంలో భారత ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు.. పెట్టుబడులు పెట్టే వారిని ఆకర్షిస్తాయని వెల్లడించారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి సాగుతున్న పోరాటంలో భారత దేశం కీలక పాత్ర పోషిస్తుందన్నారు ప్రధాని. భారత్​కు ఉన్న శక్తిని ప్రపంచ దేశాలు ఇప్పటికే చూశాయని.. ప్రపంచాభివృద్ధి కోసం తమ వంతు కృషి చేయడానికి భారతీయులు ఊవిళ్లూరుతున్నారని వ్యాఖ్యానించారు.

ప్రపంచవ్యాప్తంగా చిన్నారులకు అందుతున్న మూడింట రెండొంతుల వ్యాక్సిన్​లు భారత్​కు చెందినవేనని మోదీ పేర్కొన్నారు. కరోనా వైరస్​కు వ్యాక్సిన్​ రూపొందించడం, ఆ తర్వాత దాన్ని ఉత్పత్తి చేయడంలోనూ భారత్​ కీలక పాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం భారత కంపెనీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయన్నారు.

భారతీయ ఫార్మా ఆస్తిని ప్రపంచానికి కరోనా మహమ్మారి చూపించిందని మోడీ అన్నారు. భారతదేశ ఫార్మా ఇండస్ట్రీ భారతదేశానికి మాత్రమే కాదు, మొత్తం ప్రపంచానికి ఒక ఆస్తి అని మహమ్మారి మరోసారి చూపించింది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు మెడిసిన్స్ ధరను తగ్గించడంలో ఇది ప్రధాన పాత్ర పోషించిందని ప్రధాని అన్నారు

ట్రెండింగ్ వార్తలు