Vande Bharat Express: సీటు ఇవ్వలేదని ప్రయాణికుడిని చితకబాదిన ఎమ్మెల్యే అనుచరులు.. వందేభారత్ ఎక్స్​ప్రెస్​ రైలులో ఘటన..

రైలులో సీటు మార్చుకోవడానికి నిరాకరించిన ప్రయాణికుడిపై బీజేపీ ఎమ్మెల్యే అనుచరులు చితకబాదిన ఘటన యూపీలో చోటు చేసుకుంది.

Delhi-Bhopal Vande Bharat Express Passenger

Delhi-Bhopal Vande Bharat Express : రైలులో సీటు మార్చుకోవడానికి నిరాకరించిన ప్రయాణికుడిపై బీజేపీ ఎమ్మెల్యే అనుచరులు చితకబాదిన ఘటన యూపీలో చోటు చేసుకుంది. అదే కోచ్‌లో ఉన్న మధ్యప్రదేశ్ మాజీ మంత్రి రామ్‌విలాస్ రావత్ ఈ ఘటనను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వందే‌భారత్ లాంటి రైలులోనే ఇలాంటి పరిస్థితి ఉంటే, సాధారణ రైళ్లలోని ప్రయాణికుల పరిస్థితి ఏమిటి..? ఇలాంటి ఘటనలు తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయంటూ రాశాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Raed: Viral video: అయ్యో.. ఇదేం ఆటరా బాబు..! క్రికెట్‌లో ఇంతకు ముందెన్నడూ చూడని ఫన్నీ సన్నివేశం.. ఈ వీడియో చూస్తే నవ్వులేనవ్వులు..

ఢిల్లీ నుంచి భోపాల్ వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఎగ్జిక్యూటివ్ కోచ్‌లో రాజ్ ప్రకాశ్ అనే వ్యక్తి ప్రయాణిస్తున్నాడు. అదే కంపార్ట్మెంట్ లో బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ తన భార్య కమ్లి సింగ్, కుమారుడు శ్రేయాన్ష్‍తో కలిసి ఎక్కాడు. అతని సీటు నెంబర్ 8కాగా.. అతని భార్య, కొడుకు సీటు నెంబర్లు 50, 51. అయితే, కిటికీ పక్కనే ఉన్న సీటు నెంబర్ 49లో రాజ్ ప్రకాశ్ అనే ప్రయాణికుడు కూర్చున్నాడు. తన కుటుంబ సభ్యుల దగ్గర కూర్చోవడానికి వీలుగా తనకు సీటు ఇవ్వాలని, తన సీటులో నువ్వు కోర్చోవాలని ఎమ్మెల్యే ప్రయాణికుడు రాజ్ ప్రకాశ్ ను కోరాడు. కానీ, అతను అందుకు నిరాకరించాడు.


రైలు ఝాన్సీ స్టేషన్ చేరుకున్న సమయంలో ఏడెనిమిది మంది కోచ్‌లోకి వచ్చి రాజ్ ప్రకాశ్ పై దాడి చేశాడు. అతడిపై పిడిగుద్దులుతో దాడికి పాల్పడ్డారు. దీంతో అతని ముక్కు, ముఖానికి స్వల్పగాయాలయ్యాయి. రక్తం కారేలా గాయపర్చారు. అదే కోచ్‌లో ఉన్న మధ్యప్రదేశ్ మాజీ మంత్రి రామ్ విలాస్ రావత్ ఈ సంఘటన గురించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.


ఈ ఘటనపై ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ మాట్లాడుతూ.. సీటు నంబర్​-49, సీట్​ నంబర్​-52లో కూర్చున్న ప్రయాణికులు చాలా అసభ్యకరమైన రీతిలో కాళ్లు చాపుకుని కూర్చున్నారు. వారి ప్రవర్తన నా కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగించింది. వారిని సరిగ్గా కూర్చోమని చాలా మర్యాదగా చెప్పాను. కానీ, వారు కోపంగా నాతో వాదించడం మొదలుపెట్టారు. అసభ్యకరమైన భాషను ఉపయోగించారు. నేను అలా చేయవద్దని వారిని వారించాను. కానీ, వాళ్లు ఆగలేదని తెలిపారు. వారి ప్రవర్తనతో నా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డారని, నేను ఈ ఘటనపై ఝాన్సీ జీఆర్పీ స్టేషన్ లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశానని ఎమ్మెల్యే చెప్పారు.

ప్రయాణికుల కథనం ప్రకారం.. ఝాన్సీ రైల్వే స్టేషన్ వద్ద కొందరు వ్యక్తులు కోచ్‌లోకి ప్రవేశించి రాజ్ ప్రకాశ్ ను దారుణంగా కొట్టారు. అతని ముక్కుకు తీవ్ర గాయమైంది. కోచ్‌లోని పిల్లలు, మహిళలు భయపడి షాక్‌కు గురయ్యారు. దాడి సమయంలో ముగ్గురు నలుగురు పోలీసులు ఉన్నారు, కానీ, వారు దానిని ఆపడానికి ఏమీ చేయలేదు. తరువాత, రైల్వే పోలీసులు వచ్చారు, కానీ అప్పటికి దాడి చేసిన వారు వెళ్లిపోయారని ప్రయాణికులు పేర్కొన్నారు. దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు.