అంత్యక్రియల తర్వాత బూడిదను చోరీ చేసే ప్రయత్నం, కారణం తెలిస్తే అయ్యో పాపం అనాల్సిందే

people steal ashes from womans pyre: మహారాష్ట్రలో జరిగిన ఓ ఘటన ప్రజల ఆర్థిక కష్టాలకు అద్దం పడుతుంది. పేదరికం, ఆర్థిక ఇబ్బందులు..ఎంతటి పనైనా చేయిస్తాయని చెప్పడానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఓ గర్భిణిని దహనం చేసిన తర్వాత ఆ బూడిదను దొంగిలించటానికి ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు జైలుపాలయ్యారు.

బూడిదను దొంగలించే ప్రయత్నం:
ఈ దయనీయ ఘటన మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ ఆలస్యంగా వెలుగు చూసింది. ఇటీవల ఓ గర్భిణి ప్రసవ సమయంలో చనిపోయింది. దీంతో కుటుంబసభ్యులు ఆమె బంగారు ఆభరణాలు అలాగే ఉంచి అంత్యక్రియలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న సోలాపూర్‌ జిల్లా బర్లోని గ్రామానికి చెందిన దాదాసాహెబ్‌ హన్వంతే అతడి భార్య రుక్మిణి, రామచంద్ర కస్బే అతడి భార్య స్వాతిలు అక్కడికి చేరుకున్నారు. గర్భిణి అంత్యక్రియలు అయిపోయిన తర్వాత ఆ నలుగురు బూడిదను దొంగిలించే ప్రయత్నం చేశారు. ఇది గ్రామస్తుల కంటపడింది. వారు ఆ నలుగురిని పట్టుకుని చితక్కొట్టారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు.

ఆర్థిక ఇబ్బందులే కారణం:
బూడిదను దొంగిలించాలని ఎందుకు అనుకున్నారని పోలీసులు అడగ్గా, ఆ నలుగురు చెప్పిన సమాధానం విని పోలీసుల కళ్లలో నీళ్లు కారాయి. అయ్యో పాపం అని జాలి చూపించారు. తమ ఉద్యోగాలు కోల్పోయి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆ నలుగురు చెప్పారు. కొన్ని రోజులుగా ఆకలితో బాధపడుతున్నామని వాపోయారు. ఇదే సమయంలో.. గర్భిణి మృతదేహంపై బంగారు నగలు ఉంచి అంత్యక్రియలు చేశారని తమకు తెలిసిందన్నారు. దీంతో అంత్యక్రియల తర్వాత బూడిదలో నగల అవశేషాల కోసం వెతికేందుకు వచ్చామని తెలిపారు. బూడిదలో కరిగిన బంగారాన్ని తీసుకుని అమ్ముకుంటే అంతో ఇంతో డబ్బు వస్తుందని, తమ ఆకలి సమస్యలు తీరుతాయని వారు వివరించారు.

గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు 379(చోరీ-ఒక వ్యక్తి భావాలను గాయపరచడం లేదా మత విశ్వాసాలనుఅవమానించడం), 511(నేరం) సెక్షన్ల కింద ఆ నలుగురిపై కేసు నమోదు చేశారు.

ట్రెండింగ్ వార్తలు